షాద్‌నగర్‌టౌన్, జనవరి 1 : 2021సంవత్సరానికి బైబై చెబుతూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలను పట్టణ ప్రజలు సంతోషంగా నిర్వహించారు. 2021లో ఎదుర్కొన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలంటూ పలువురు ఆలయాల్లో శనివారం ఉదయం పూజలు చేశారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని వేడుకున్నారు. పట్టణ ప్రజలు, యువత తమ నివాసాల్లో కేక్‌లను కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను నూతన ఉత్సాహంతో నిర్వహించుకున్నారు. పలువురు పట్టణ ప్రజలు పారాషూట్లను ఎగురవేశారు. పట్టణం మొత్తం న్యూఇయర్ సందడే కనిపించింది. శుక్రవారం రాత్రి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించారు. యువత మద్యం తాగి అల్లర్లు చేయకుండా ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో షాద్‌నగర్ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణ ముఖ్యకూడలిలో ఏసీపీ పోలీసులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
మొయినాబాద్ :నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం ఉదయం చర్చిలకు వెళ్లి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
జోష్ గా నయా సాల్ వేడుకలు….
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో నయా సాల్ వేడుకలు జోష్‌గా జరుపుకొన్నారు. ఆమనగల్లు , కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పోలీసుల సూచనల పాటిస్తూ ప్రజలంతా వేడుకలను జరుపుకొన్నారు. యువతీ, యువకులతో పాటు చిన్నారులంతా ఆట, పాటలతో వేడుకలను నిర్వహించుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐలు ఉపేందర్, కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు విధులు చేపట్టారు. ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. వేంకటేశ్వర స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, అయ్యసాగర్ క్షేత్రాల్లో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
నియోజకవర్గంలోన్యూ ఇయర్ వేడుకలు
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలోని మండలాల్లో శనివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని యాచారం, మం చాల, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బంధు మిత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అన్ని మండలాల నుంచి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది యువకులు కేకు కట్ చేసి స్వీట్లు పంచుకొని ఎంజాయ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శనివారం వికారాబాద్ జిల్లాలోని పలు ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. నూతన సంవత్సరంలో తమకు ఆయురారోగ్యాలను సుఖ:శాంతులను కలుగజేయాలని వేడుకున్నారు. అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆనంద్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. బుగ్గ రామలింగేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని నందిఘాట్ వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆనందంగా గడిపారు. తమ స్నేహితులతో కలిసి కేకులు కట్ చేసి తినిపించుకున్నారు. అటవీ అందాలను చూస్తూ ప్రకృతి ఒడిలో మైమరచిపోయారు. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామ శివారులో ఉన్న పరమేశ్వరుడి గుట్టను దర్శించి పూజలు చేశారు.
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌ను శనివారం క్యాంపు కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు తినిపించారు. కొడంగల్ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్థానికులు ధనుర్మాస పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. కులకచర్ల మండలపరిధిలోని బండవెల్కిచర్ల పాంబం డ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నూతన వాహనాలకు పూజలు చేయించారు. దోమ మండలం మైలారం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
పల్లెల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రజలు 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి సాదరంగా స్వాగతం పలికారు. ఇండ్ల ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇండ్లలోనే వేడుకలను ఉత్సాహంగా జరుకొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు. కేకులు కట్ చేసి తినిపించుకున్నారు. మిత్రులు, బంధువులకు ఫోన్లలో సందేశాలు పంపుతూ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి వరకు బేకరీ షాపులు, కిచెన్ సెంటర్లు, మటన్ దుకాణాలు రద్దీగా కనిపించాయి.