ఇబ్రహీంపట్నం, మే 29 : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా రికార్డు కొట్టింది. సర్కార్ జారీచేసిన పోలీసు నియామకాల నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాకు మించి వచ్చాయి. 2016, 2018లో వెలువడిన నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 1,83,503మంది ఐప్లె చేసుకున్నారు. ఎక్కువమంది నిరుద్యోగ అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలపై దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలతో పాటు ఇతరత్రా ఉద్యోగాల కోసం రంగారెడ్డిజిల్లా నుంచి 72,472మంది పురుషులు, 22,829మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా నుంచి 32,793మంది పురుషులు, 9649మంది మహిళలు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రంగారెడ్డిజిల్లా మొదటిస్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,610పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందుకు గానూ 12,91,056మంది దరఖాస్తులు చేసుకున్నారు. గురువారం దరఖాస్తులకు చివరిగడువు ప్రకటించిన నేపథ్యంలో రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా పోలీసుశాఖలో 17,516పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఈ దరఖాస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12,91,058దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో రంగారెడ్డ్జిజిల్లా నుంచే పెద్ద ఎత్తున ధరఖాస్తులు రావటం విశేషం, పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే 1.50లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారే అత్యధికంగా ఉన్నారు. ఓవైపు రాచకొండ పోలీసు కమిషనర్రేట్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి ముందుకొచ్చిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కోచింగ్ సెంటర్లల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఎక్కువశాతం కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పోలీసుశాఖలోనే 17,516పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించింది. కానిస్టేబుల్ పోలీసులు 16,321, ఎస్సై సివిల్ 554, ఎస్సై కమ్యూనికేషన్ 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు ఎక్కువమందికి దక్కే అవకాశాలున్నాయి.
ప్రభావం చూపుతున్న కోచింగ్ సెంటర్లు..
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల కోసం పోటీపడి ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డిజిల్లా పరిధిలో సైబరాబాద్, రాచకొండ జంట కమిషనర్రేట్ల ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థుల కోసం సుమారు 15వరకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కమిషనర్రేట్లతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి 2016, 2018స సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు 380మంది వరకు కానిస్టేబుల్, ఎస్సైతో పాటు వివిధ పోస్టులను దక్కించుకున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 16000మంది నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో సుమారు 200 నుంచి 400మంది వరకు నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు..
ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహిస్తామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
నిరుద్యోగుల్లో పెరిగిన పట్టుదల..
ప్రభుత్వం అత్యధిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో మూడింతల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి., ఒక్క సివిల్ ఎస్సై పోస్టుకు సగటున 447మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 660మంది, పోటీ పడుతున్నారు. అలాగే, కానిస్టేబుల్ పోస్టులకు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. దీంతో ఒకొక్క కానిస్టేబుల్ పోస్టుకు 60 నుంచి 70మంది పోటీ పడుతున్నారు.