కడ్తాల్, మే 29 : మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు షాదీఖానలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా జామా మజీద్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మసూమ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ముస్లింల విద్యాభివృద్ధికి ప్రభుత్వం రాష్ట్రంలో 275 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని, తెలంగాణకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. అనంతరం షాదీఖానలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.5 లక్షలకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను మైనార్టీ నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు షాదీఖానలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరియాదవ్ సహకారంతో చేపట్టిన బోర్ డ్రిల్లింగ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం ఆమనగల్లుకు చెందిన మైనార్టీ నాయకులు మసూమ్, బాబా, రవూఫ్, జబ్బార్, ఆరిఫ్, నయీం, చోటాబేగ్, అన్వర్, అజభర్, అఫ్జల్, షఫీతోపాటు మరో 45 మంది మైనార్టీ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరియాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, కౌన్సిలర్లు సోనీజయరామ్, రాధమ్మ, నాయకులు సయ్యద్ ఖలీల్, రజాక్, షఫీ, ఖాదర్, పాషా పాల్గొన్నారు.