ఇబ్రహీంపట్నం, మే 29 : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ బాలుర వసతి గృహానికి చెందిన ఓ విద్యార్థి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాకు చెందిన అరవింద్ ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో ఉంటూ శేరిగూడ సమీపంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ఫైనలియర్ చదువుతున్నాడు. ఊహించని రీతిలో అతడు శనివారం సాయంత్రం వసతి గృహం నుంచి బయటికి వెళ్లి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వసతి గృహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అరవింద్ ఆత్మహత్య చేసుకోవడాన్ని సహచర విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. అరవింద్ సెల్‌ఫోన్ మూడు రోజుల క్రితం మిస్సైంది. సెల్‌ఫోన్ పోవడం వల్ల రెండు రోజులుగా ఆహారం కూడా తీసుకోకుండా ఒంటరిగా ఉంటున్నాడని సహచరులు చెప్పారు. విద్యార్థి మృతిపై సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వసతిగృహం విద్యార్థి మృతిచెందిన విషయం తెలుసుకున్న రంగారెడ్డి కలెక్టర్ వెంటనే విచారణ జరుపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు కూడా విద్యార్థి మృతిపై రిపోర్టు తయారుచేస్తున్నారు.