కులకచర్ల, మే 26 : ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కన్నా పుట్టిన ఊరిలోనే ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు కొంత మంది మహిళలు, యువకులు. మండలంలోని చౌడాపూర్, మందిపల్, ముజాహిద్పూర్, కామునిపల్లి, పీరంపల్లి తదితర గ్రా మాలకు చెందిన మహిళలు, యువకులు సీజనల్ వ్యాపారాన్ని చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. మొన్నటి వరకు చింతపండు వ్యాపారాన్ని చేసిన వారు.. ప్రస్తుతం మామిడి కాయల వ్యాపారం చేస్తూ పలువురికి ఉపాధిని చూపుతున్నారు. ప్రతి ఏడాది వారు గ్రామాల్లోని మామిడి తోటలను లీజుకు తీసుకొని మామిడి కాయల నుంచి ఒరుగును తయారు చేసి మార్కెట్లో విక్రయించి లాభాలను పొందుతున్నారు.
ప్రస్తుతం క్వింటాల్ మామిడి ఒరుగుకు మార్కెట్లో సుమారు రూ.20 నుంచి రూ.25 వేలకు పైగా ధర పలుకుతున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఏడాది మామిడి కాయలు అంతంత మాత్రంగానే కాయడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. మామిడి ఒరుగును హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ వారు లాభాలను ఆర్జిస్తూ పలువురికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఉదయం సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లొచ్చిన మహిళలు ప్రత్యామ్నాయంగా మరో పనిని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆయా గ్రామాల్లో నీడలోనే ఉండి మామిడి కాయల నుంచి ఒరుగును తీసేందుకు వెళ్లి ప్రతిరోజూ రూ.200 నుంచి 500 వరకు ఆర్జిస్తున్నారు.
మామిడి ఒరుగు తయారీ విధానం..
మామిడి ఒరుగు తీసే సమయంలో మామిడి కాయలను శుభ్రంగా కడిగి తోలు తీసి ఒరుగును తయారు చేస్తారు. తయారు చేసిన ఒరుగును శుభ్రమైన ప్రదేశంలో ఆరబెడతారు. ఆరబెట్టిన ఒరుగును సంచుల్లో నింపి మార్కెట్కు తరలిస్తారు. దీంతో పలువురు వ్యాపారులు అధిక లాభాలను పొందుతున్నారు. అంతేకాకుండా మామిడి తోటలను లీజుకు తీసుకుని కాయలను కూడా హైదరాబాద్లోని పలు మార్కెట్లకు తరలించి లాభాలను ఆర్జిస్తున్నారు.
అదనపు ఆదాయం వస్తున్నది..
ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మామిడి ఒరుగు తీసే పనికెళ్తున్నా. ప్రతి రోజూ రూ.200 నుంచి 500 వరకు అదనపు ఆదాయం వస్తున్నది. ఈ ఏడాది మామిడి కాయలు అంతంత మాత్రంగానే కాయడంతో మామిడి కాయలు, పండ్లు, ఒరుగుకు మంచి డిమాండ్ ఉన్నది.
-చంద్రమ్మ, కూలీ చౌడాపూర్
మహిళలకు ఉపాధి..
మామిడి కాయలతో మహిళలకు ఉపాధి లభిస్తున్నది. ఉదయం ఉపాధి హామీ పనికెళ్లి మధ్యాహ్నం సమయంలో మామిడి కాయల ఒరుగు తీసే పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. సీజనల్ వ్యాపారం చేసుకునే వారికి మంచి ఆదాయం లభిస్తున్నది. ఈ వ్యాపారం నెల రోజుల వరకు మాత్రమే ఉంటుంది.తక్కువ సమయంలో ఎక్కువగా ఆదాయాన్ని పొందొచ్చు. మామిడి కాయల వ్యాపారంలో వ్యాపారులతోపాటు కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తున్నది.
-కొత్త ఉమాపతిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,చౌడాపూర్