పరిగి, మే 26: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలను అం దించాలని నిర్ణయించింది. పేదలకు కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనేక వసతుల కల్పన, బస్తీ దవాఖానల తరహాలో కొత్తగా పల్లె దవాఖానల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను తీసుకున్నది. మరోవైపు కిడ్నీ రోగులకు మరింత మేలైన సేవలను అందించేందుకు డయాలసిస్ సెంటర్ల సంఖ్యను కూడా పెంచింది. వికారాబాద్ జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 23 పీహెచ్సీలుండగా కోట్పల్లి మండలం మినహా మిగతా అన్ని పీహెచ్సీల్లో ఈ పథకం అమలు కానున్నది.
అమలుకు సన్నాహాలు..
జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి పాస్ట్వర్డ్, లాగిన్ ఐడీలు పీహెచ్సీలకు చేరాయి. అలా గే పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులకు ఆరోగ్యశ్రీ అమలుపై ప్రత్యేకంగా శిక్షణ కూడా పూర్తైంది. జిల్లాలో వైద్యులు అందుబాటులో ఉండే అన్ని దవాఖానల్లో వచ్చే నెల రెండు నుంచి అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీకి చెందిన ఉన్నతాధికారులు అనంతగిరిలో వికారాబాద్ జిల్లాలోని పీహెచ్సీ వైద్యులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఏఏ వైద్యసేవలను అందించవచ్చునో వారికి వివరించారు.
53 రకాల వైద్య సేవలు..
ఆరోగ్యశ్రీ కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 53 రకాల వైద్యసేవలను రోగులకు అందిస్తారు. వివి ధ రకాల ఆపరేషన్లు మినహా మిగతా అన్ని రకాల వైద్యసేవలను వైద్యులు అందిస్తారు. జ్వరం, మలేరియా, డెంగీ, సీజనల్ వ్యాధులు, ఇతర 53 రకా ల వ్యాధులకు వైద్యాన్ని పొందొచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలకోసం తెల్లరేషన్ కార్డులు, ఏఏపీ, ఆర్ఏపీ, పీఏపీ, వైఏపీ కార్డులుంటే సరిపోతుంది. ఇవి లేకపోతే సీఎన్సీవో నుంచి లెటర్ ఉంటే కూ డా వైద్యాన్ని అందిస్తారు. ఆరోగ్యశ్రీ కింద ఒక్క కేసు నమోదైతే రూ. 2,100 ప్రభుత్వం నుంచి మంజూరవుతాయి. ఇం దులో 30 శాతం డబ్బులు, వైద్యులు, మరికొంత వైద్య సిబ్బందికి అందుతాయి. మిగిలిన మొత్తాన్ని దవాఖాన అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ప్రోత్సాహకాలు అందనుండటంతో వైద్యులు మ రింత ఉత్సాహం, శ్రద్ధతో వైద్యసేవలను అందించనున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక కార్డులోని కుటుం బ సభ్యులందరికీ ఒక ఏడాదిలో రూ.5లక్షల విలువ చేసే వైద్యసేవలను ఉచితంగా పొందొచ్చును. సుదూ ర ప్రాంతాల్లోని పట్టణాలకెళ్లి వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మండల కేంద్రాల్లోని పీహెచ్సీల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు అందించనుండటం తో పేదలకు ఎంతో మేలు జరుగనున్నది. ఈకేంద్రా ల్లో మందులను కూడా అందించనున్నారు.
22 పీహెచ్సీల్లో..
జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తాం. ఈ సేవలపై ఇప్పటికే పీహెచ్సీ వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం పూర్తైంది. ఎలాంటి సేవలు ఈ పథ కం కిందకు వస్తాయో తదితర అంశాలపై కూ డా వారికి అవగాహన కల్పించాం. ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు 53 రకాల వైద్యసేవలను అందిస్తాం.
-డాక్టర్ తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి