ఇబ్రహీంపట్నం, మే 16 : పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లోని యువత కోసం ప్రయోగాత్మకంగా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగానే మొట్టమొదటిసారిగా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీల్లో ఈ జిమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో రూ.15లక్షల వ్యయంతో ఈ జిమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లి డబ్బులు చెల్లించుకోలేనివారు ఈ జిమ్‌లను వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణనగర్ కాలనీలో గతంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.15 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ జిమ్‌కు వెంకటరమణనగర్ కాలనీతో పాటు 3, 4, 5, 6 వార్డులకు చెందిన యువత ఉదయం, సాయంత్రం వచ్చి వ్యాయామం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా జిల్లాలో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంతో ఇవి మంచి ఫలితాలిస్తున్నాయి. అలాగే, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో కూడా ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్‌జిమ్ ద్వారా ఎంతోమంది యువకుల వ్యాయామానికి దోహదపడుతున్నది. పట్టణ ప్రగతిలో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు యువతకూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు మంచి ఫలితాలిస్తునాయి.
జిల్లావ్యాప్తంగా ఏర్పాటుకు అధికారుల నిర్ణయం..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే పట్టణ ప్రగతిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ యోచిస్తున్నది. జిల్లాలోని 16 మున్సిపాలిటీలకుగానూ ప్రస్తుతం 3 ఓపెన్ జిమ్‌లు మాత్రమే ఉన్నాయి. మిగతా మున్సిపాలిటీల్లోనూ జిమ్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కాగా, ఇప్పటికే ఓపెన్ జిమ్‌లు అవసరమున్న మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలను కోరినట్లు తెలిసింది. అలాగే, జిల్లాలోని కార్పొరేషన్లలో ఓపెన్ జిమ్‌లను రెండు లేదా మూడు చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు ఆశించిన రీతిలో యువతకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో కొత్తవాటిపైన దృష్టి సారించారు.
పేద యువతకు ఉపయోగపడుతుంది..
ఇబ్రహీంపట్నంలోని వెంకటరమణనగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో పేద యువత వ్యాయామం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్ ఎంతగానో ఉపయోగపడుతున్నయ్. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేసుకునే స్థోమత లేనివారికి జిమ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి జిమ్‌లను మరికొన్ని ఏర్పాటు చేస్తే యువతకు మేలు జరుగుతుంది.
-సుజాత, కౌన్సిలర్ యాచారం
రోజూ వ్యాయామం చేస్తున్నాం ..
తమ కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తున్నాం. ప్రతిరోజూ నేను, నా స్నేహితులు కూడా ఈ జిమ్‌కు వచ్చి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాం. ఈ జిమ్ ఏర్పాటు చేయటం వల్ల తాము ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే అవసరం లేకుండా పోయింది.
– శివ, ఇబ్రహీంపట్నం