తొలి విడుత లబ్ధిదారుల జాబితా సిద్ధం
రంగారెడ్డి జిల్లాలో 698 మంది, వికారాబాద్ జిల్లాలో 358 మంది ఎంపిక
రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ
ముమ్మరంగా బ్యాంకు ఖాతాల ఓపెనింగ్
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు
ఆధార్‌కార్డు, ఫొటోలు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాల సేకరణ
వచ్చే నెల 7వ తేదీలోగా యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యేలా కసరత్తు
దళితుల మోములో వెల్లివిరుస్తున్న ఆనందం
రంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు త్వరలో పేదల గూటికి చేరనున్నది. ఆయా నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలు పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలో 698 మంది ఎంపిక కాగా, వికారాబాద్ జిల్లాలో 358 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. మార్చి 7లోగా గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన దృష్ట్యా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫొటోలను సేకరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పేరిట బ్యాంకు ఖాతాలు తెరువగా, మిగిలిన వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ కానుండడంతో దళితుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
జిల్లాలో దళితబంధు తొలి విడుత లబ్ధిదారుల లెక్కతేలింది. ప్రతి నియోజకవర్గానికి వంద మందికి అవకాశమివ్వగా, జిల్లాలోని పలు నియోజకవర్గ జిల్లాతో వికారాబాద్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ పరిధిలో ఉండడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మండలాలను బట్టి స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అర్హులైన వారిని దళితబంధు లబ్ధిదారులుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 నియోజకవర్గాలుండగా 698 మంది లబ్ధిదారులను తొలి విడుతకుగాను ఎంపిక చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా, సంబంధిత లబ్ధిదారుల జాబితాకు జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆమోదం అనంతరం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దళితబంధు లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ అమయ్‌కుమార్‌కు అందజేశారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను కూడా శనివారం పూర్తి చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలైన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫొటోలను అధికారులు సేకరించారు. మార్చి 7లోగా గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన దృష్ట్యా ఇందుకు అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుండడం, తదనంతరం వారి ఖాతాల్లో ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున డబ్బు చేయనున్నది. అనంతరం గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.
బ్యాంకు ఖాతాల ప్రక్రియ ముమ్మరం దళితబంధుతో దళితుల ఆర్థికాభివృద్ధి సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో రానున్న రోజుల్లో దళితులు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని షాద్‌నగర్, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో తొలి విడతకుగాను 698 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ పూర్తయింది. సోమవారంలోగా మిగతా వారి బ్యాంకు ఖాతాలను తెరువనున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి యూనిట్లను మాత్రమే జిల్లా యంత్రాంగం మంజూరు చేయనున్నది. అంతేకాకుండా యూనిట్‌కు సంబంధించి నైపుణ్యాన్ని పొందేందుకుగాను అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మరోవైపు లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10 వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకుగాను ఈ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
యూనిట్లు ఇవే…
దళితబంధు పథకంలో భాగంగా యూనిట్లకు సంబంధించి మినీడెయిరీ, ట్రాక్టర్-ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరి నాటు యంత్రం, పందిరి కూరగాయల సాగు, ఏడుగురు కూర్చునే సామర్థ్యంగల ఆటో, ఆటో రిక్షా, సరుకు రవాణా ఆటో, ఐరన్ గేట్స్-గ్రిల్స్ తయారీ యూనిట్-ఆటో, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సెంట్రింగ్, మట్టి ఇటుకల తయారీ-ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్, బియ్యం, పసుపు గిర్ని, మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం సేవలు, ఎలక్ట్రికల్ షాప్-మోటార్ వైన్డింగ్-బ్యాటరీ సేవలు, హార్డ్‌వేర్-శానిటరీ దుకాణం, విత్తనాలు-ఎరువుల-క్రిమిసంహారక మందుల దుకాణం, వ్యవసాయ సాగుకోసం యంత్ర పరికరములు అమ్మకం, హోటల్-క్యాటరింగ్-ఆటోట్రాలీ, డీటీపీ-మీసేవా-సీఎస్సీ ఆన్లైన్ సెంటర్-ఫొటో స్టూడియో, డయాగ్నోస్టిక్ ల్యాబ్-మెడికల్ షాప్, టెంట్‌హౌస్-డెకరేషన్-లైటింగ్-సౌండ్ సిస్టం-ఆటోట్రాలీ వంటి యూనిట్లతోపాటు లబ్ధిదారులు కోరుకునే ఇతర యూనిట్లను మంజూరు చేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 358 మందికి దళితబంధు
పరిగి, ఫిబ్రవరి 6 : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 358 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేసిన ఎమ్మెల్యేలు సంబంధిత నోడల్ అధికారులకు అందజేశారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ లబ్ధిదారులకు సంబంధించిన అన్ని పరిశీలనలు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.
కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ
వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ గ్రామాల్లో కొనసాగుతున్నది. జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది, తాండూరులో 100, పరిగి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 80 మంది, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 60 మంది, చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలంలో 18 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. ఈ జాబితాను ఆయా నియోజకవర్గాల నోడల్ ఆఫీసర్లకు అందజేశారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా వ్యవసాయాధికారి, తాండూరు నియోజకవర్గానికి జిల్లా పంచాయతీ అధికారి నోడల్ ఆఫీసర్లుగా నియమించగా జిల్లా మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు అందజేసిన లబ్ధిదారుల జాబితా నోడల్ ఆఫీసర్లు పరిశీలించారు.
గ్రామాల్లో ప్రక్రియ ముమ్మరం..
దళితబంధు కింద లబ్ధిచేకూర్చేందుకు ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన లబ్ధిదారుల వెరిఫికేషన్ కొనసాగుతున్నది. తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారుల నేతృత్వంలో ఈ వెరిఫికేషన్ చేపట్టడం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా లబ్ధిదారులు 60 ఏండ్లలోపు ఉండాలి. అలాగే ఒంటరి మహిళలు అర్హులు కారు. మిగతా వారికి సంబంధించి ఆధార్‌కార్డు, కులం ధ్రువీకరణ, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. ఈ దృవీకరణ పత్రాలు లేనివారు వెంటనే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని పొందాల్సిందిగా సూచిస్తున్నారు. దళితబంధు లబ్దిదారులుగా ఎంపికైన వారికి మీ సేవ ద్వారా వెంటనే ఈ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని వికారాబాద్ కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు.