బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా పార్టీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు జరుగనుండగా.. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి, అనంతరం నియోజకవర్గస్థాయి సమావేశాలకు హాజరుకానున్నారు. ఒక్కో గ్రామం నుంచి 25-30 మంది చొప్పున పార్టీ ప్రతినిధులు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలు పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
-వికారాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నియోజకవర్గస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు అన్ని నియోజకవర్గాల్లోని ఊరూరా బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలను నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు జిల్లాలోని వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. వికారాబాద్ సమావేశాన్ని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో, కొడంగల్ సమావేశాన్ని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో, తాండూరు సమావేశాన్ని యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా సమీపంలోని గ్రౌండ్లో, పరిగి సమావేశాన్ని శారద గార్డెన్లో నిర్వహిస్తారు.
నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధుల సభలు
ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా మంగళవారం అన్ని నియోజకవర్గస్థాయిల్లో సమావేశాలను కేవలం పార్టీ ప్రతినిధులతో మాత్రమే నిర్వహించనున్నారు. గ్రామాల్లో నియమించిన ఆయా పార్టీ కమిటీలకు సంబంధించిన పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కో గ్రామం నుంచి 25-30 మంది చొప్పున హాజరుకావాలని ఎమ్మెల్యేలు సూచించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గస్థాయిల్లో నిర్వహించే సమావేశాలను 3-4 వేల మందితో నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి చర్చించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుపడంతోపాటు.. గ్రామగ్రామాన తీసుకెళ్లేలా పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ ముఖ్య ప్రతినిధులు మండలానికి ఒకరు చొప్పున ఒక్కో అంశంపై మాట్లాడనున్నారు.
ఊరూరా జెండా పండుగ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ఊరూరా పార్టీ జెండా పండుగను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడనున్నాయి. ఉదయం 8 గంటలకు గ్రామగ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఏర్పాట్లు పూర్తి : మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే
నియోజకవవర్గస్థాయి సమావేశాలకు సంబంధించి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సమావేశాలను పార్టీ ముఖ్య ప్రతినిధులతో నిర్వహించనున్నాం. ఒక్కో గ్రామం నుంచి 20-30 పార్టీ ప్రతినిధులతో మొత్తం 3 నుంచి 4 వేల మందితో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశాం. సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నాం.