వికారాబాద్, జూలై 22 : వికారాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వేసిన రోడ్లు ఆరు నెలలకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. రోడ్డు నాణ్యత లేకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుండటంతో ప్రజలు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. వికారాబాద్ మండలంలోని కామారెడ్డిగూడలో గతేడాది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.8 లక్షలతో సీసీ రోడ్డు వేయగా ఆరు నెలలకే దానిపై పగుళ్లు వచ్చాయి. అలాగే, బురాన్‌పల్లి గ్రామంలోనూ రూ.20 లక్షలతో సీసీ రోడ్డు వేయగా.. 8 నెలలకే ఆ రోడ్డు బీటలు వారి పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు.
వికారాబాద్ ధన్నారం నుంచి కామరెడ్డిగూడ వరకు కంకర తేలి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్నది. రెండు కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు పలుమార్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 2025 జనవరి 31న ఎంఆర్ఆర్ నిధులు రూ.80 లక్షలు, అంతకుముందు రూ.25 లక్షలతో బీటీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు కాగా.. రోడ్డు వేస్తారని సంతోషించిన ప్రజలకు నిరాశే మిగిలింది. నిధులు మంజూరై ఏడాదిన్నర గడిచినా ఇంకా రోడ్డు పనులను ప్రారంభించనేలేదు. కామరెడ్డిగూడపై స్పీకర్‌కు ఎంత ప్రేముందో దీనిని బట్టి తెలుస్తున్నదని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అలాగే, వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు బాగా లేకపోవడంతో పిల్లనిచ్చే పరిస్థితి లేదని గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రచారం చేసి.. ఓట్లు వేయించుకుని.. విజయం సాధించి.. ఇప్పుడు శాసనసభా స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. వికారాబాద్ సెగ్మెంట్లో ఎందుకు రోడ్లను బాగు చేయడంలేదని పలువురు వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఓట్లు కావాలి కాని.. మా అభివృద్ధి పట్టదా..? అని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
ఏ చిన్న పని ఉన్నా వికారాబాద్ పట్టణానికి వెళ్లాల్సిందే. కామరెడ్డిగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగ్గాలేదు. ధన్నారం నుంచి కామరెడ్డిగూడ వరకు బీటీ రోడ్డు మంజూరైనా.. ఇంకా పనులను అధికారులు ప్రారంభించడంలేదు. ఆ పనులను త్వరగా షురూ చేసి వాహనదారుల అవస్థలు తీర్చాలి.
– శివరాజ్, ఉప సర్పంచ్, కామరెడ్డిగూడ, వికారాబాద్
పగుళ్లు రాకుండా పనులు చేపట్టాలి
గ్రామాల్లో వేస్తున్న రోడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వేస్తుండటంతో ఆరు నెలల్లోనే బీటలు వారి పగుళ్లు ఏర్పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలా జరుగుతూ ప్రజాధనం వృథా అవుతున్నది. పగిలిన రోడ్లపై రాకపోకలు సాగిస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
– పీరంపల్లి మల్రెడ్డి, కామరెడ్డిగూడ, వికారాబాద్