యాలాల, ఆగస్టు 31: ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులు చేపట్టి సకల హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులకు వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనునిత్యం ప్రత్యేక పర్యవేక్షణ చేయడంతో వసతి గృహాలు నూతన శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక వసతుల కోసం భారీగా నిధులు మంజూరు చేసింది. వసతి గృహాల్లో ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు, డైనేజీ, వాటర్ పైప్‌లైన్ తదితర పనులను ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు, బ్యాగులను, పుస్తకాలను కూడా అందించింది. విద్యార్థులు నిద్రించడానికి మ్యాట్రెస్, పిల్లోలను అందించింది.
విద్యార్థులకు చేయూత.. విద్యకు భరోసా
విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని ప్రతి వసతి గృహంలో అందిస్తున్నది. మెనూ పట్టికలో పొందు పరిచిన విధంగా నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు స్నాక్స్ అందిస్తున్నది. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్, వార్డెన్ తదితర పోస్టులతో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టులను భర్త్తీ చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నది. హాస్టళ్లలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి హాస్టల్లో 6 సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ర్యాగింగ్‌పై పూర్తి నియంత్రణ
వసతి గృహాల్లో ర్యాగింగ్‌లకు చెక్ పెట్టడం కోసం కఠిన చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. విద్యార్థులతో ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవడంతో పాటు విధుల నుంచి తొలగిస్తున్నది. ర్యాగింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నది. విద్యార్థుల వైఖరిలో మార్పు రాకుంటే వారిని సస్పెండ్ చేస్తున్నది.
ఎస్సీ వసతి గృహాలకు కొత్త శోభ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వసతి గృహాల రూపురేఖలను మార్చివేయడంతో నూతన శోభను సంతరించుకొని విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి మ్యాట్రస్లతో పాటూ దిండ్లను అందించింది. అందులో భాగంగా తాండూరు డివిజన్ పరిధిలో 11, యాలాల ఎస్సీ వసతి గృహానికి 100 మ్యాట్రస్లతో పాటూ పిల్లోలను ఇవ్వడం జరిగింది. ఇది నా హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటూ మౌలిక వసతులను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తుంది. విద్యార్థుల ఉన్నతికై నిరంతరం ఆలోచించే సీఎం ఉండడం మన అదృష్టం. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ హాస్టల్లో 6 సీసీ కెమరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
– ఎమ్.వీరానందం, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏఎస్డబ్ల్యూఓ), తాండూరు
మా హాస్టల్ ఇంటిని తలపిస్తుంది
ప్రభుత్వం అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడం ఆనందంగా ఉంది. మా వసతి గృహంలో 100 మ్యాట్రెస్లతో పాటు పిల్లోలను అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యా వ్యవస్థ చాలా బాగా కొనసాగుతున్నది. మా ఎస్సీ హాస్టల్ వార్డెన్ వీరానందం సర్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కని వాతావరణంలో ఉంటున్నాం. వారి పర్యవేక్షణ బాగుంది. మా ఇంటిని తలపిస్తుంది మా హాస్టల్.
– నర్సింహులు, విద్యార్థి, ఎస్సీ బాలుర హాస్టల్,యాలాల
విద్యారంగానికి పెద్దపీట
వసతి గృహాలపై ప్రభుత్వ పర్యవేక్షణ చాలా బాగుంది. సీఎం కేసీఆర్ వసతి గృహాల్లో నివసించే మా లాంటి బీద విద్యార్థుల గురించి ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, షూలతో పాటు చక్కగా నిద్రించడానికి మ్యాట్రెస్లతో పాటు పిల్లోలను అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి దన్యవాదాలు.
– మల్లేశ్, విద్యార్థి, ఎస్సీ బాలుర హాస్టల్,యాలాల