ఆమనగల్లు, జూలై 15 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు నవ చైతన్యకాలనీలో రేణుకా ఎల్లమ్మ ఆలయ స్థల ఆక్రమణ ఆపాలని, దళిత కుటుంబాలపై నమోదు చేసిన కేసులకు వారు పడుతున్న ఆవేదనపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జూలై 7న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సుమోటాగా కేసును స్వీకరించింది.
నోటీస్ అందిన ఏడు రోజుల్లోపు ఈ విషయంపై సమగ్ర నివేదిక పంపాలని ప్యూచర్‌సిటీ కమిషనర్‌తోపాటు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు వారి నుంచి ఎటువంటి వివరణ రాకపోవడంతో నేడు(జూలై 15) మళ్లీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. నోటీస్ అందిన ఐదు రోజుల్లోపు ఈ విషయంపై తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యల నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించాలని వారిని ఆదేశించింది.