షాద్‌నగర్, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో తగిన గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో బాలికలకు చదువు చాలా ముఖ్యమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైన తల్లి దండ్రులు తమ పిల్లలను చదివించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, అన్ని పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన జరుగుతుందని చెప్పారు.
బాలికల సమస్యలపై ఎప్పటికప్పుడూ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కేక్‌ను కట్ చేసి బాలికలకు పంచి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల, నందిగామ ఎంపీపీ ప్రియాంక, కౌన్సిలర్ చెట్ల పావణి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కాంచనలత అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవవాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రక్తహీనత ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి విద్యార్థినికి హెల్త్ క్యాంపు ద్వారా బాలికలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అనురాధ, ఎన్ఎస్ఎస్ యూనిట్ కో ఆర్డినేటర్ జ్యోతి, షేక్ మహబూబ్, స్వర్ణలత, సతీష్, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : బాలికల పట్ల వివక్ష చూపకూడదని ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్కాల పరమేశ్ అన్నారు. బుధవారం ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికలను రక్షిద్దాం.. బాలికలను ఎదుగనిద్దాం.. సాధికారత సాధింప చేద్దాం.. అనేదానిపై పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం కేక్ కట్‌చేసి పాఠశాలలో అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభ చూపిన బాలికలకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. బాలికలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు బాబ్లీ, విద్యార్థులు పాల్గొన్నారు.