ఆమనగల్లు, సెప్టెంబర్ 7 : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. ఆదివారం సంకటోనిపల్లి, గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, చంద్రాదన, వెంకట్రావ్పేట తండాలకు చెందిన ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోనున్న రైతులు పెద్దఎత్తున ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దురా నాయనా-ట్రిపుల్ఆర్, పేదోళ్ల పొట్ట కొట్టకు – బడాబాబులకు పంచిపెట్టకు, జై జవాన్-జై కిసాన్ అంటూ నినాదాలు పెద్దఎత్తున చేశారు.
ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ.. బడాబాబుల భూములను కాపాడేందుకే మా భూముల్లోంచి ట్రిపుల్ఆర్ను నిర్మిస్తున్నారని మండిపడ్డారు. మా ప్రాంతంలో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 350 ఎకరాల భూమి ఉందని ఆ భూమిని కాపాడేందుకు అలైన్మెంట్ మార్చారని.. దానితో ఎకరం, రెండు ఎకరాల సన్నకారు, చిన్నకారు రైతుల భూములు పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న భూములు పోతే మేము ఎలా బతకాలని.. మా బిడ్డల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. భూములు పోతే అనాథలం అవుతామని.. తలా లీటర్ పురుగుల మందు ఇవ్వండి తాగి చనిపోతాం..
ఆ తర్వాత మా శవాలపై రోడ్డు వేసుకోవాలని రైతులు అల్టిమేటం జారీ చేశారు. ప్రజా పాలన అంటే పేద రైతుల పొట్ట కొట్టడమేనా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేదన్నారు. భూముల దగ్గరకొస్తే మా ప్రాణాలైనా ఇస్తాం.. కానీ, మా భూములను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం రైతులు ర్యాలీగా పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాకు చేరుకుని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయగా.. పోలీసులు వచ్చి రైతులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో రైతులు లక్ష్మయ్య, వెంకటేశ్‌గౌడ్, చిన్న లక్ష్మయ్య, జంగయ్యగౌడ్, రమేశ్‌యాదవ్, శ్రీకాంత్‌నాయక్ తదితరులున్నారు.
కేశంపేట : అరకొరగా ఉన్న తమ భూములపై ప్రభుత్వం గద్దలా వాలడం సరికాదని, తమ ప్రాణాలను అడ్డుపట్టైనా భూములను కాపాడుకుంటామని తొమ్మిదిరేకుల గ్రామస్తులు హెచ్చరించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులంతా గ్రామంలో ఆదివారం సమావేశమై మాట్లాడుతూ.. గతంలో ఎంపిక చేసిన ప్రాంతాలను వదిలి తమ గ్రామం మీదుగా ట్రిపుల్ఆర్ నిర్మాణం చేపట్టడం వెనక ఆంతర్యయూమిటని ప్రశ్నించారు. గ్రామంలోని సర్వే నంబర్లు 34, 35, 36, 40, 41, 44, 45, 46, 47, 54, 55, 56, 57, 58, 59, 65, 70, 76, 84, 85, 86, 87, 88, 106, 107, 108, 109, 110, 111, 113, 115, 116, 117, 118, 122, 127, 128, 129, 130లలో గల భూమిని రహదారి నిర్మాణానికి ఎంపిక చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో మొత్తం చిన్న, సన్నకారు రైతుల భూములే ఉన్నాయని, వాటిని తీసుకుంటే మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రంగయ్య, మాజీ సర్పంచ్‌లు బాల్‌రాజ్‌గౌడ్, భీమయ్య, గ్రామస్తులు బాలయ్య, శివకుమార్, తిరుపతి, నరేశ్, చంద్రయ్యగౌడ్, కుమార్, శ్రీను, కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుజీవన్రెడ్డి, శేఖర్, శ్రీశైలం పాల్గొన్నారు.