సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు ప్రయాణికుల డిమాండ్లను పరిష్కరించకుండా పార్కింగ్ ఫీజులు పెంచుతామంటున్న ఎల్ అండ్ టీ మెట్రో అధికారులపై ప్రయాణికులు భగ్గుమంటున్నారు. గత నెలలోనే నాగోల్,మియాపూర్ మెట్రో స్టేషన్లలో కొత్తగా పార్కింగ్ ఫీజులు పెంచుతామని బోర్డులు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అధికారులు వెనక్కి తగ్గారు.
మళ్లీ తాజాగా మెట్రో ప్రయాణికులకు 3 ఆఫర్లు అంటూ ప్రకటిస్తూనే… నామమాత్రపు పార్కింగ్ ఫీజును అక్టోబర్ 6 నుంచి వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 3 బోగీలతో నడుస్తున్న మెట్రో రైళ్లకు అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేయాలని నెలల తరబడిగా డిమాండు చేస్తున్నా.. ఆవిషయాన్ని పట్టించుకోకుండా పార్కింగ్ ఫీజులు పెంచుతారా.? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.