ధారూరు, నవంబర్ 14: మండల పరిధిలోని స్టేషన్ ధారూరు, దోర్నాల్ గ్రామాల మధ్య కాగ్నానది ఒడ్డున ఉన్న మెథడిస్ట్ చర్చి వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేటి నుంచి ఆరు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా దక్షిణాది రాష్ర్టాల నుంచి కూడా క్రైస్తవులు, భక్తులు లక్షల సం ఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపను న్నది. బెంగళూరు కేంద్రంగా మెథడిస్ట్ చర్చి ఇండియా కమిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
మెథడిస్ట్ పేరున ఉన్న క్రైస్తవులు వికారాబాద్ పేరున కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బిషప్‌ల పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా రు. గత రెండేండ్లుగా తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక చొరవతో నిధులను మం జూ రు చేయడమే కాకుండా యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా కారణంగా 2020, 2021 రెండేండ్లపాటు ఉత్సవాలను నిర్వ హించలేదు. సుమారుగా 35 ఎకరాల స్థలంలో కాగ్నానది పక్కన ఆరు రోజులపా టు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లా మైనారిటీ సం క్షేమాధికారి అధికారి సుధారాణి సంబంధిత మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు ని ర్వ హించి భక్తులకు ఇబ్బందులు కలుగకుం డా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతర ప్రత్యేక ఉత్సవాలు..
ధారూరు మెథడిస్టు చర్చి ఉత్సవాల్లో ఏసు కీర్తనలు, భజనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. జాతర ప్రాంగణంలో జాతర ప్రా రంభం నుంచి ఆరు రోజుల పాటు క్రీస్తు శిలువ వద్ద నిత్యం ప్రార్థనలు కొనసాగుతా యి. చాలా మంది గొర్రెలు, మేకలు, కోళ్లు, గోవులను దానంగా నిర్వాహకులకు అందజేస్తారు.
ప్రభుత్వ ఏర్పాట్లు..
ఈ నెల 15 నుంచి 20వ తేదీ ఆదివారం వరకు జరిగే ధారూరు మెథడిస్టు చర్చి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత రెండేండ్లుగా జాతరను కరో నా ప్రభావంతో నిర్వహించలేదు. అందువల్ల నేటి నుంచి జరిగే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉ న్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నారు. కాగ్నానదిపై ఉన్న పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. తాత్కాలికంగా పైపులు వేసి, మట్టిపోసి వం తెనను ఏర్పాటు చేసి రాకపోకలకు అం తరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. జాతర ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, స్నా నాల గదులు, ఫ్లడ్‌లైట్లు, చెత్తకుండీలు, మెడికల్ క్యాంపు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మెథడిస్టు చర్చి జాతర సమయంలో ధారూరు, బీదర్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తారు. హైదరాబాద్-ముంబై వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ధారూరుస్టేషన్లో నిలు పనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జాత ర ప్రాంగణం వరకు ఆర్టీసీ బస్సులను నడుపనున్నది.
చర్చి చరిత్ర..
1921 సంవత్సరంలో బీదర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో అత్యవసర పని నిమిత్తం రెవరెండ్ సీమ న్స్, అతడి మిత్రుడు సీమండ్స్ అనే ఇద్దరు క్రైస్తవ ప్రయాణికులు కూడా ప్రయాణించా రు. అయితే ఆ రైలు ధారూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. రైలు వెళ్లాలంటే మూడు గంటలపాటు ఆలస్యం అవుతుందని తెలు సుకున్నారు. ఆలస్యం అవుతుండడంతో వెళ్లిన పని జరుగుతుందో లేదోననే ఆందోళన వారిలో మొదలైంది. అనంతరం ఆ ఇద్దరు మిత్రులు రైలు నుంచి కిందికి దిగి పక్కనే ఉన్న కాగ్నానది ఒడ్డుకు చేరుకుని ఓ ఇప్పచెట్టు కింద కూర్చుని యేసుక్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు చేశారు.
ప్రార్థనలు ముగించిన అనంతరం రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వారిలో చాలా సంతోషం కలిగింది. అనంతరం వారు హైదరాబాద్‌కు వెళ్లగా అనుకున్న పని పూర్తి కావడంతో సంతోషించిన మిత్రులిద్దరూ కాగ్నానది ఒడ్డున గల ఇప్పచెట్టు కింద మహిమ ఉందని, అక్కడ దేవుడు ఉన్నాడని భావించి .. మరుసటి ఏడాది ఏ రోజైతే కాగ్నానది పక్కన ప్రార్థనలు చేశారో అదే రోజున ఆ స్థలంలో ఉత్సవాలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఉత్సవాలను నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఇద్దరితో ప్రారంభమైన ఉత్సవాలు ప్రస్తుతం లక్షలాది యాత్రికులు, భక్తులతో ఘనంగా జరుగుతున్నాయి.