రంగారెడ్డి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఆదివారం ఆయన ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేసి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కొంగరకలాన్‌లో రూ.1,656 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ యూనిట్ నిర్మాణ పనులకు మే 15న ఆయన భూమి పూజ చేయగా.. నెల రోజుల తర్వాత ప్లాంట్ ఈ దశలో ఉందని ఫొటోలు, వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ స్పీడ్’అంటూ ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ గతంలో చేసిన మాటలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని.. తెలంగాణ స్పీడ్ అన్న మాటలను యంగ్ లియూ బృందం బాగా అనుసరిస్తున్నదని మంత్రి కితాబిచ్చారు.