ఇబ్రహీంపట్నం, జూన్ 22 : రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు కానున్న ఫాక్స్‌కాన్‌తో ఈ ప్రాంత ఉద్యోగుల కల సాకారం కానుంది. రంగారెడ్డిజిల్లా తూర్పు ప్రాంత నిరుద్యోగులకు ఫాక్స్‌కాన్‌తో ఎంతోమంది స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. సుమారు లక్షమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పట్టుబట్టి ఫాక్స్‌కాన్‌ను ఈ ప్రాంతానికి తీసుకురావటంలో కీలకపాత్ర పోషించారు.
4600కోట్లతో జపాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థను కొంగరకలాన్ సమీపంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సుమారు రెండువందల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటానికి అప్పటి ఐటీశాఖమంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతో తెలంగాణలో ఏర్పాటు చేయించారు. ముందుగా కంపెనీ ప్రతినిధులు గుజరాత్, మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ ఫాక్స్‌కాన్ ప్రతినిధులను ఒప్పించి వారికి అన్ని రకాల భరోసా కల్పించి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. గత సంవత్సరం మార్చి 2న ఆ సంస్థ ఛైర్మన్ యంగ్లీయూతో తెలంగాణ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది.
అందులో భాగంగానే మే 15న కొంగరకలాన్‌లోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఫాక్స్‌కాన్ సంస్థకు ఆ సంస్థ ఛైర్మన్ యంగ్లీయూతో కలిసి అప్పటి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు భూమిపూజ చేశారు. అప్పటినుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అప్పటినుంచి మొదటిదశలో రూ.2640కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ప్రారంభించారు. ఇందులో మొదటిదశ పనులు పూర్తి కావస్తున్నందున, వచ్చే ఆగస్ట్టు నుంచి ఉత్పత్తులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో సంస్థలో పనిచేయటానికి ఆసక్తి ఉన్నవారిని ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి దశలో రూ.2,640కోట్లతో ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటుకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే మొదటిదశ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయల సమీపంలో రెండువందల ఎకరాల్లో అతి పొడవైన షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో తయారయ్యే సెల్ఫోన్ల తయారీకి అనుగుణంగా ఈ ప్రాంతంలో పలు రకాల షెడ్లు, భవనాల నిర్మాణం చేపట్టారు. ఆగస్టు నుంచి ఇక్కడ ఫోన్ల తయారీ ప్రారంభంకానున్నది. మొత్తం రూ.4600కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. రెండోదశలో మిగిలిన పనులను పూర్తిచేయనున్నారు. పూర్తిస్థాయిలో పరిశ్రమ తయారైతే లక్షమందికి ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యేయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్ పరిశ్రమతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగుల కల నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న ఇబ్రహీంపట్నం ప్రాంత యువతకు ఈ కంపెనీ ఏర్పాటుతో ఉపాధి లభించనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు కానున్నది.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే