రంగారెడ్డి, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కొహెడలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ పండ్ల మార్కెట్ స్థల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతుండడంతో దాని నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్‌ను ఖాళీ చేసిన తర్వాత కొహెడలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఆరు నెలల్లోపు పూర్తిస్థాయి సౌకర్యాలతో పండ్ల మార్కెట్‌ను నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలు అమలు కావడంలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కొహెడలో సర్వేనంబర్ 507, 548లో 178 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయిస్తూ 13-02-2020లో జీవో జారీ చేసింది.
ఈ స్థలంలో ఆరునెలల్లోపు వ్యాపారులకనుగుణంగా మార్కెట్‌ను నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. కొహెడలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో తాత్కాలికంగా షెడ్లు వేయగా గాలివానకు అవి లేచిపోవటంతో వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్కును అద్దెకు తీసుకుని తాత్కాలికంగా పండ్ల మార్కెట్‌ను అందులోకి మార్చారు. ఈ స్థలంలోనే గత కేసీఆర్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మించాలని సంకల్పించింది. అవసరమైన నిధుల కోసం డీపీఆర్‌నూ రెడీ చేయగా.. అంతలోనే ప్రభుత్వం మారడంతో మార్కెట్ నిర్మాణం తాత్కాలికంగా వాయిదా పడింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొహెడలో పండ్ల మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని రాత్రికి రాత్రే టీజీఐఐసీకి మళ్లించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలంలోనే ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. అందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేసి నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, కొంతమంది స్థానిక నేతల ఒత్తిడితోనే ఈ స్థలాన్ని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించినట్లు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వేనంబర్ 507, 548లో గల 178 ఎకరాలను కాకుండా సర్వేనంబర్ 167లో వివాదం లో ఉన్న 239 ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించటంపై పలువురు వ్యాపారులు అనుమానంతోపాటు ఆందోళన చెందుతున్నారు. ఈ 239 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయిస్తున్నట్లు మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. క్యాబినెట్లోనూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సర్వేనంబర్ 167లో సుమా రు 500 ఎకరాల వరకు ఉన్నది.
ఈ భూమిని గతంలో హౌసింగ్ బోర్డుకు కొంత కేటాయించగా.. మరికొంత వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్నది. మిగిలిన భూమిపై రైతులు కోర్టుల్లో కేసులు వేయగా.. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు కొహెడ పండ్ల మార్కెట్‌కు గతంలో కేటాయించిన స్థలంలోనే నిర్మించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. ఆ స్థలంలో కాకుండా వివాదాస్పద స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికి ఎలా కేటాయిస్తారని వ్యాపారులు, రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సర్వేనంబర్ 167 లో గుట్టలు, రాళ్లతోపాటు ఆలయం కూడా ఉందని.. ఆ భూమి మార్కెట్ నిర్మాణానికి అనుకూలం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆరు మాసాల్లో పండ్ల మార్కెట్‌ను నిర్మించకపోగా ఉన్న స్థలాన్ని మరో చోటుకు తరలించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.