కొడంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్శితులై పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సాయప్పతో పాటు మరికొందరు హనుమంతు, లాలప్ప, బీమప్ప ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి కాకుండా తమ పదవులను కాపాడుకునేందుకు నాయకులు పాలన చేపట్టడం జరిగిందని, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కార దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నట్లు తెలిపారు. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అన్నింటా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృషి, పట్టుదలకు ఆకర్శితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కలిసి కట్టుగా నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా పాటుపడదామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూధన్యాదవ్, బొంరాస్పేట నాయకులు చాంద్పాషాతో పాటు మద్దూర్ టీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, శివకుమార్, నర్సింహులు పాల్గొన్నారు.