షాబాద్, నవంబర్ 2: స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాకా పోరాడుతామని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు జడల రాజేందర్‌గౌడ్, తమ్మలి రవీందర్, కల్వకోల్ వెంకట్‌యాదవ్, రాపోలు నర్సింహులు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మండల తమ్మలి సంఘం సభ్యులు రిలే దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని షాబాద్‌లో రిలే నిరహార దీక్షలు చేపట్టడం గొప్ప పరిణామమన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు పోనమోని రమేశ్‌యాదవ్, చేవెళ్ల స్వామి, గడ్డం చంద్రపాల్, రాము, మాజీద్, తమ్మలి సంఘం సభ్యులు తదితరులున్నారు.