మర్పల్లి, మే 7 : మర్పల్లి రైల్వేస్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ స్టాప్ ఏర్పాటుకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే అధికారులను కలిసి విన్నవించడంతో ఈ నెల 9 నుంచి బీదర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దీంతో మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 3న సికింద్రాబాద్‌లోని రైల్ భవన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ను కలిసి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ముఖ్యంగా ఎన్నో ఏండ్ల నుంచి మర్పల్లి రైల్వేస్టేషన్ వద్ద హైదరాబాద్ ఇంటర్సిటీ రైలు ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇది తక్షణ అవసరమని, దీంతో మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి మండలాల ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు లబ్ధి పొందుతారని జీఎంకు వివరించారు. స్పందించిన జీఎం ఈ నెల 9 నుంచి రైలు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. మర్పల్లిలో రైలును ఆపేందుకు కృషి చేసిన ఎంపీకి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు మర్పల్లి నుంచి హైదరాబాద్‌కు, సాయంత్రం 8 గంటలకు హైదరాబాద్ నుంచి మర్పల్లికి చేరుకుంటుందని.. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఆరేండ్ల కల నెరవేరింది : వసంత్‌కుమార్, మర్పల్లి
మర్పల్లిలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల కోసం మండల ప్రజలు ఎదురు చూస్తున్న ఆరేండ్ల కల నెరవేరింది.. మర్పల్లి, బంట్వారం, కోటపల్లి మండలాల ప్రజలు, ఉద్యోగులకు ఉపయోగంగా ఉంటుంది. దీంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. నిరంతరం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి సారుకు కృతజ్ఞతలు. మర్పల్లి-హైదరాబాద్ రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు ఆరు నెలలకు రూ.2400 చెల్లించి పాసులు తీసుకుని వినియోగించుకోవాలి.