ఆమనగల్లు, సెప్టెంబర్ 1 : ఆమనగల్లు పట్టణంలో బుధవారం పురపాలక సంఘం ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవానికి ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లను ఆహ్వానించకపోవడం సరికాదని ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ తోట గిరి యాదవ్ అన్నారు. గురువారం నిరసనగా ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆచారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, పురపాలక సంఘం చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రొటోకాల్ పాటించకుండా లైట్లను ప్రారంభించడం దళిత ఎంపీ రాములును అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ రాములు కేంద్ర మంత్రులతో చర్చించి రూ.4.50 కోట్ల్ల నిధులు మంజూరు చేయించి తుక్కుగూడ, కందుకూర్, కడ్తాల్, మైసిగండి, విఠాయిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం, నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో రోడ్డు డివైడర్, బారికేడ్ల నిర్మాణం, సెంట్రల్ లైట్లను ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. నిధులను తాను మంజూరు చేయించానని ఆచారి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, మాలేపల్లి సర్పంచ్ పబ్బతి శ్రీను, రూపం వెంకట్‌రెడ్డి, వస్పుల సాయిలు, బాలస్వామి, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు.