కొండాపూర్, ఆగస్టు 25 : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మై క్యూర్ యాప్(My Cure app )సీఎంసీ పరిధిలో నామమాత్రంగా మారింది. ప్రజలు యాప్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. వాటిని పరిష్కరించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత సమస్య పరిష్కారమైందా లేదా అన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే ఫిర్యాదులను గాలికొదిలేసి, తప్పుడు చిత్రాలను అప్లోడ్ చేస్తూ సమస్య పరిష్కారం అన్నట్లు ఫిర్యాదును మూసివేస్తున్నారు.
ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు యాప్ను ఆశ్రయిస్తున్నప్పటికీ, అక్కడ కూడా పరిష్కారం లభించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్లో ఫిర్యాదు చేసినా.. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులను కలిసి సమస్య పరిష్కరించమని వేడుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
దీంతో ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సిన మై క్యూర్ యాప్.. ఫిర్యాదులు స్వీకరించే వేదికగానే మిగిలిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించడంతోపాటు ఫిర్యాదుదారుడికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే సీఎంసీ పరిధిలో పలుచోట్ల ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మై క్యూర్ యాప్లో నమోదయ్యే ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, ప్రజలకు నిజమైన పరిష్కారం అందించాలని కోరుతున్నారు.