వికారాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మా దిరిగానే ఈ సారి కూడా అధికంగా బాలికలే ఉత్తీర్ణులయ్యారు. 69.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయి లో జిల్లా 25వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణతాశాతం పెరిగింది. గతేడాది ఇంటర్ ఫలితాల్లో 63.13% మేర విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా ఈ ఏడాది 6 శాతం మేర పాస్ అయ్యారు.
అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఉత్తీర్ణతాశాతం గతేడాదితో పోలిస్తే తగ్గింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియ ర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా అనుకున్న ఫలితాలు రాలేదు. మరోవైపు మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు, సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపునకు ఈనెల 20 వరకు గడువు విధించినట్టు ఇంటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా 31వ స్థానంలో నిలవగా 52.74 % మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
69.23% పాస్
జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 12,080 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,257 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఏడాదిలో 5,372 మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా 69.23% ఉత్తీర్ణతతో 3,719 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 2,404 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 60.98% ఉత్తీర్ణతతో 1,466 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 2,968 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 70.91% తో 2,253 మంది పాసయ్యారు. మొదటి ఏడాదిలో 6,708 మంది పరీక్షలకు హాజరుకాగా 3,538 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 62.87%తో బాలికలు ముందంజలో ఉండగా, 41.51శాతంతో బాలురు వెనుకబడ్డారు.
ప్రథమ ఏడాదిలో 3,528 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 2218 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 3,180మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 1320 మంది పాసయ్యా రు. ఇంటర్ వొకేషనల్ మొదటి ఏడాదిలో 1,687 మంది హాజరుకాగా 59.04% 996 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలురు 687 మంది పరీక్షలకు హాజరుకాగా 37.15 %తో 255 మంది ఉత్తీర్ణులుకాగా.. 1000 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 74.10% ఉత్తీర్ణతతో 741 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ రెండో ఏడాది ఫలితాల్లో 1,353 మంది పరీక్షలకు హాజరుకాగా 76.05% ఉత్తీర్ణతతో 1,029 మంది విద్యార్థులు పాలయ్యారు. వారిలో 466 బాలురు లలో 270 మంది బాలురు, 887 బాలికల్లో 759(85.57%) మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రంలో రెండోస్థానంలో రంగారెడ్డి జిల్లా.. పాస్ శాతం 81.61
రంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. గతంలో సాధించిన రిజల్ట్స్ కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితా లను సాధించింది. జిల్లాలో బాలికల(47.61%)దే హవా కొనసాగింది. జిల్లాలో 74,723 మంది పరీక్షలకు హాజరు కాగా…60,981మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఉత్తీర్ణతా శాతం 81.61గా నమోదైంది. 3,042 మంది పలు కారణాలతో పరీక్షలకు హాజరు కాలేదు. ఆమనగల్లు, మాడ్గుల, షాద్‌నగర్ జూనియర్ కళాశాలలు మొదటి సంవత్సరంలో 50 శాతం ఫలితాలనే సాధించగా.. ద్వితీయ ఏడాదిలో మెరుగైన రిజల్ట్స్‌ను సాధించాయి.