శంకర్పల్లి, డిసెంబర్ 28 : శంకర్పల్లి మున్సిపాలిటీలోని, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500 నీటి కనెక్షన్లు ఉన్నాయి. మండలం, మున్సిపాలిటీలో మిషన్ భగీరథ కోసం రూ. 31కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. గతంలో మండలంలోని గ్రామాల్లో కిలో మీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవారు. శంకర్పల్లి మండలంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడంతో ప్రజల కండ్లలో ఆనందం కనిపిస్తున్నది. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఎండాకాలం వస్తే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ నీరు రావడంతో ప్రతి ఇంటికీ నీరు వస్తున్నది.
సరిపడా నీళ్లు వస్తున్నాయి
శంకర్పల్లి మండలంలో గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా వారికి సరిపడా నీరు సరఫరా అవుతున్నది. గతంలో ప్రజలు వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి బిందెలతో నీటిని తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు వస్తున్నది. గ్రామాల్లో ప్రతి రోజూ లక్షల లీటర్ల తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రజల నీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శంకర్పల్లి
ప్రతి ఇంటికీ తాగునీరు
మిషన్ భగీరథ నీటి ద్వారా శంకర్పల్లి మున్సిపాలిటీ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. గతంలో ట్యాంకర్లతో నీటిని ప్రజలకు సరఫరా చేసేవాళ్లం. గంటల తరబడి బోరింగ్ల వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇంటికీ భగీరథ నల్లాల కనెక్షన్లు ఇవ్వడంతో నీటి సమస్యలు తీరాయి. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
– విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్