తాండూరు, మార్చి 10 : తాండూరు జిల్లా దవాఖాన, ఎంసీహెచ్ ఆస్పత్రులకు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ వినయ్ తీరు వివాదాస్పదంగా మారింది. అతడు తమను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని మంగళవారం నర్సింగ్ సిబ్బంది వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా డ్యూటీ రోస్టర్ వేయాల్సిన నర్సింగ్ సూపరింటెండెంట్లపైనా జులుం చెలాయిస్తూ తాను చెప్పినట్టే డ్యూ టీలు వేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు .. అతడికి అనుకూలంగా ఉండే వారికి అనుకూలంగా ఉండే డ్యూటీలు వేయిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మహిళా సిబ్బందికి లీవ్‌ల మంజూరులోనూ వేధిస్తున్నట్టు వివరించా రు. సీసీ కెమెరాలపై వస్ర్తాలు కప్పి డ్యూటీ సమయంలో తన చాంబర్లో మద్యం తాగు తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. నర్సింగ్ సిబ్బంది ఆరోపణలపై విచారించిన వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ..డాక్టర్ వినయ్‌పై ఇంతకుముందు కూడా పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
తాజాగా జరిపిన విచారణలో ఒక నర్సు తాను గర్భవతినని తనకు లీవ్ మంజూరు చేయాలని కోరినా ఇవ్వకుండా..నైట్ డ్యూటీ వేయడంతో ఆమెకు అబార్షన్ జరిగిందని.. ఒక దశలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని విచారణలో తేలడంతో డాక్టర్ వినయ్ ను ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు చెప్పా రు. ఆయన స్థానంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ మూర్తిని ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా నియమించేందుకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కూడా డాక్టర్ వినయ్‌పై నర్సింగ్ సిబ్బంది లిఖిత పూర్వకంగా ఫిర్యా దు చేశారు. స్పందించిన ఆయన వెంటనే ఆ డాక్టర్‌ను మార్చాలని పై అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.
తాండూరు జిల్లా దవాఖాన, ఎంసీహెచ్ దవాఖానలకు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ వినయ్ నర్సింగ్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విషయం వాస్తవమే. గతంలోనూ అతడిపై ఫిర్యాదులొచ్చాయి. తాజాగా అతడి వేధింపులు, ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నాడన్న విషయం రుజువైంది. మంగళవారం సాయంత్రమే ఆయన్ను సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పించేందుకు ఆర్డర్ తయారు చేశాం. బుధవారం నుంచి కొత్త సూపరింటెండెంట్‌ను ఇన్చార్జిగా నియమిస్తాం.
– డాక్టర్ ఆనంద్, వికారాబాద్ జిల్లా డీసీహెచ్ఎస్