పెద్దేముల్, నవంబర్ 28 : మండల పరిధిలోని మారేపల్లి గ్రామ సమీపంలో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ధరణి కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంట గది, కూరగాయలు, విద్యార్థుల గదులు, పరిసరాలు, మూత్రశాలను పరిశీలించి విద్యార్థులతో ఆరోగ్య విషయాలను మాట్లాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని.. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, తాగునీరు రెండు చాలా ముఖ్యమని.. బయటి పదార్థాలు తినరాదని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని కూడా పరిశీలించారు. భోజన సిబ్బందితో మాట్లాడుతూ బియ్యాన్ని, కూరగాయలను శుభ్రంగా కడగాలని, కుళ్లిన కూరగాయలతో వంట చేయరాదని.. చేతులు శుభ్రంగా కడుక్కొని వంట చేయాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడుతూ.. ఆర్వో ప్లాంట్ పాడై ఎన్ని రోజులు అయింది? విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలని, ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ‘సిక్ రూమ్’, టేబుల్, ర్యాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ఎంతమంది హాజరయ్యారో తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రశాంతి, ఆర్బీఎస్కే డాక్టర్ నిఖిల్, పీహెచ్ఎన్ అరుణకుమారి, ఏఎన్ఎం ముంతాజ్, స్థానిక ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ సమీనాబేగం, ఆశావర్కర్ నర్సమ్మ ఉన్నారు.
పెద్దేముల్ దవాఖాన తనిఖీ
పెద్దేముల్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి మండలంలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ఆన్లైన్ అప్డేట్కు సంబంధించి.. ఇంటింటికీ కొనసాగుతున్న సర్వే వివరాలు, మారేపల్లి కేజీబీవీ ఘటన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్సీడీ, ఎన్సీహెచ్, వెక్టార్ బార్న్ డిసీజ్, టీఎఫ్ శాంపిల్, ఓపీడీ అంశాలను పీహెచ్సీ, సబ్‌సెంటర్ల వారీగా కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమన్వయంతో పనిచేసి పెద్దేముల్ మండలాన్ని ఆరోగ్య మండలంగా తయారుచేయడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు.