మొయినాబాద్, మార్చి27 : డెయిరీ ఫాంలో భారీగా లాభాలు వస్తాయని ప్రకటనలు వేశాడు…ప్రకటనలు చూసిన వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు…..పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని బాగా నమ్మించాడు…..పెట్టుబడులు పెట్టించి ఆరు ఏండ్ల తరువాత డెయిరీ ఫాంను మూసివేసి పెట్టుబడులు పెట్టిన వారిని నట్టేట ముంచి డెయిరీ వ్యాపారి పరార్ అయ్యాడు. ఈ భారీ మోసం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళ్లగా ప్రస్తుతం కోకాపేటలో నివాసం ఉంటున్న వేముల సుబ్బారావు, అతని భార్య వేముల కుమారి డెయిరీఫాంను ఆరు ఏండ్ల క్రితం నాగిరెడ్డిగూడ గ్రామంలో ఏర్పాటు చేశారు. మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కీసరి సంజీవరెడ్డి పొలం అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఉంటుంది.కాగా డెయిరీ ఏర్పాటుతో పాటు వ్యవసాయం చేయడానికి కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి 2019లోనే సంజీవరెడ్డి వద్ద లీజుకు తీసుకున్నాడు.అయితే శ్రీనివాస్‌రావు ,హైదరాబాద్ నగరంలో పక్కాలోకల్ పేరుతో రెస్టారెంట్లు నడుపుతున్న కోటేశ్వర్రావు ఇద్దరు స్నేహితులు.
డెయిరీ వ్యాపారి వేముల సుబ్బారావు అనే వ్యక్తి నగరంలో కోటేశ్వర్రావు రెస్టారెంట్లకు డెయిరీ ప్రొడక్ట్‌లు సరఫరా చేస్తుంటాడు.ఈ క్రమంలో పెద్దగా డెయిరీ ఫాం పెట్టాలని ఉందని,తమకు పొలం కావాలని కోటేశ్వర్‌రావును అడగగా అజీజ్‌నగర్‌లో నా స్నేహితుడు లీజుకు తీసుకున్న పొలం ఉందని, దానిలో డెయిరీ పెట్టుకో అని చెప్పాడు. దీంతో వేముల సుబ్బారావు,అతని భార్య ఇద్దరు కలిసి అజీజ్‌నగర్‌లో శ్రీనివాస్‌రావు లీజుకు తీసుకున్న పొలంలో డెయిరీని ఏర్పాటు చేశారు.డెయిరీని మరింత పెద్ద ఎత్తున పెట్టాలని భావించి రెండేండ్ల క్రితం పెట్టుబడులను ఆకర్షించడానికి కొండపల్లి డెయిరీ పేరుతో ప్రకటనలు ఇచ్చాడు. పెట్టుబడులు పెడితే భారీగా ఖచ్చితమైన లాభాలు వస్తాయని ప్రకటనలో పేర్కొనడంతో కొందరు ఆశపడి ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టారు. మొత్తానికి 6 సంవత్సరాల పాటు డెయిరీని నిర్వహించాడు. సుమారుగా పది మంది వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అందరి నుంచి దాదాపుగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడులు రాబట్టుకున్నాడు.
అందులో సాయి హరీశ్ అనే వ్యక్తి ఒక్కడే సుమారుగా రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు.పెట్టుబడులు పెట్టిన వారికి కొందరికి డెయిరీలో వచ్చిన లాభాలు కూడా ఇచ్చాడు.అత్యాశకు పోయిన వేముల సుబ్బారావు పెట్టుబడులు పెట్టిన వారిని మోసం చేయాలని ఆలోచించి ఉన్నట్టుండి గత 9 రోజుల క్రితం డెయిరీని పూర్తిగా ఎత్తివేశాడు.పెట్టుబడులు పెట్టిన వారు వారం రోజుల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారికి అనుమానం రావడంతో డెయిరీ వద్దకు వచ్చి చూసే సరికి డెయిరీ మూతపడి ఉండటంతో పెట్టుబడులు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురై వారం రోజుల క్రితం మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు.అధికంగా పెట్టుబడులు పెట్టి మోసపోయిన సాయి హరీష్ అనే వ్యక్తి ముందుగా ఫిర్యాదు చేశాడు.అనంతరం మరో ఎనిమిది మంది బాధితులు వేరుగా ఫిర్యాదు ఇచ్చారు.పెట్టుబడులు పెట్టిన వారిని మోసం చేసిన డెయిరీ వ్యాపారి వేముల సుబ్బారావు,అతని భార్య వేముల కుమారిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.పెద్ద మొత్తంలో ఆర్థిక నేరం జరిగిందని ఈ కేసును సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగంకు బదిలీ చేశామని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.