రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్నది. అయితే సర్వేకు ప్రభుత్వం కేటాయించిన సమ యంపై గందరగోళం నెలకొన్నది. ప్రస్తుతం వరి కోతలు, పత్తి తీత పనులు జోరుగా సాగుతున్న వేళ మధ్యాహ్నం సమయంలో సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించ డంతో ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. రైతులు, కూలీలు ఇండ్లకు తాళా లు వెళ్లి పొలాలకు వెళ్తారని.. వ్యాపారులు, ఉద్యోగులు తమ తమ పనులకు వెళ్తార ని.. అప్పుడు సర్వే ఎలా సవ్యంగా సాగుతుందని పేర్కొంటున్నారు. యజమానులు అందుబాటులో లేకుంటే మళ్లీ మళ్లీ ఇండ్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని.. అప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సర్వే పూర్తి కాదని.. అందువల్ల ఒక్కో ఎన్యూమరేటర్‌కు కుటుంబాల సర్వే బాధ్యతలు తగ్గించాలని కోరుతున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో మొత్తం 2,63,362 కుటుంబాలు ఉండగా.. సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం 2024 మంది ఎన్యూమరేటర్లు, పర్యవేక్షణకు 208 మంది సూపర్వైజర్లను నియమించింది.
-పరిగి, నవంబర్ 5
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 18 తేదీ వరకు అంటే 13 రోజుల పాటు ఏకకాలంలో కొనసాగనున్నది. అయితే సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రభుత్వం నిర్దేశించిన సమయంపై గందరగోళం నెలకొన్నది. సాధారణంగా ఏ సర్వే చేసినా ఉదయం పూట చేపడితే ప్రజలు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం నుంచి సర్వే చేయమంటే ఎలాగని ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి పత్తి తీసే పనులు, వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రైతులు మొదలుకొని కూలీ పని చేసే వారంతా ఈ పనుల్లో బిజీగా ఉంటారు. కొందరు కూలీలు ఇతర గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు.
వారంతా ఉదయం 8 గంటలకు తమ గ్రామాల నుంచి బయలుదేరి.. తిరిగి సాయంత్రం 7 గంటల తర్వాతే ఇండ్లకు వస్తారు. దీంతో గ్రామాల్లో సగం కంటే ఎక్కువ ఇండ్లు మధ్యా హ్నం సమయంలో తాళాలు వేసే ఉంటాయి. మరోవైపు ఉద్యోగులు, చిరు వ్యాపారులు సైతం మధ్యాహ్నం సమయంలో తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. సర్వే సందర్భంగా తప్పనిసరిగా కుటుంబ యజమాని అందుబాటులో ఉంటేనే పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. అలాంటిది అందరూ పనులకెళ్తే సర్వే చేయడం ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని.. అందువల్ల ఒక్కో ఎన్యూమరేటర్‌కు 100 నుంచి 150 కుటుంబాలు ఇవ్వాలని కోరగా 175 ఇవ్వడంతో సమయం సరిపోదని పేర్కొంటున్నారు.
కుటుంబ యజమాని అందుబాటులో లేకుంటే మళ్లీ మళ్లీ ఆ ఇంటికి వెళ్లి సర్వే చేయాల్సి ఉంటుందని.. అందువల్ల ఎన్యూమరేటర్లకు కేటాయించిన కుటుంబాల సంఖ్యను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఇదిలావుండగా సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే కొనసాగనున్నా యి. దీంతో ప్రాథమిక పాఠశాలలపై భారం పడుతుందని, ఒత్తిడి పెరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలతోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సగం మందిని సర్వే కోసం తీసుకుంటే ఒకవైపు పాఠశాలలు పనిచేయడం, మరోవైపు సర్వే కొనసాగుతుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో కుటుంబాల సంఖ్య..
వికారాబాద్ జిల్లాలో మొత్తం 2,63,362 కుటుంబాలు ఉండగా ప్రతి ఎన్యూమరేటర్ 175 కుటుంబాలకు సంబంధించిన సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం 2024 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎన్యూమరేటర్లుగా నియమించింది. ఈ సర్వేను 208 మంది సూపర్వైజర్లు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే వారందరికీ సర్వే చేపట్టాల్సిన విధానంపై శిక్షణా తరగతులు నిర్వహించా రు. ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు సర్వేకు సంబంధించి సేకరించిన వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం మండలాలు, మున్సిపాలిటీలవారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సర్వేలో మొత్తం 75 ప్రశ్నలుంటాయి.