షాబాద్, ఏప్రిల్ 8: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ప్రముఖ న్యాయవాది, మాజీ సర్పంచ్ బేగరి ఆంజనేయులు అధ్యక్షతన నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినిసాయిచంద్తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 1003 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యనందించినట్లు తెలిపారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే గొప్ప నేత అంబేద్కర్ అని చెప్పారు.
ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో నేడు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని, బాగా చదువుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జాతీయ దళితసేన అధ్యక్షుడు జేబీ రాజ్, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడు మాస్టార్జీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, ఎంపీటీసీ గుత్తి సునీత, మాజీ సర్పంచ్‌లు ఆంజనేయులు, మద్దూరి శకుంతల, మాజీ ఎంపీటీసీ మద్దూరి పాండు, శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగులు నీరటి రాంచంద్రయ్య, యాదయ్య, ఉపాధ్యాయులు దోస్వాడ నర్సింహులు, ఆశీర్వాదం, వివిధ పార్టీల నాయకులు సున్నపు వసంతం, వీరేందర్‌రెడ్డి, రామస్వామి, చెన్నయ్య, సత్తయ్య, మణెయ్య, మహిపాల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.