గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ్రామాల్లో పండుగ కళ ఉట్టిపడుతున్నది. బంధువులు, ఆడపడుచుల రాకతో ఇండ్లు సందడిగా మారాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.
-పెద్దఅంబర్‌పేట/బొంరాస్‌పేట, జనవరి 13
హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ప్రధానమైనది సంక్రాంతి ఒకటి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగను జరుపుకొంటారు. రైతులు పండించిన పంటలు చేతికొచ్చిన వేళ ఈ పండుగను మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకొంటారు. ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ పండుగను చేసుకోనున్నారు. సంక్రాంతి పండుగకు ఊరూవాడ పోటీలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇప్పటికే ఆయా ఊర్ల పేర్లతో క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లు మొదలుపెట్టారు. మరికొందరు పండుగ సెలవులు మొదలుకాగానే పోటీల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు.
ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేస్తున్నారు. దాతల సహకారంతో పోటీలను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్‌లీగ్) తరహా ఇటీవల ప్రతిచోట ఆ ఊరి పేరుతో ప్రీమియర్ లీగ్‌లు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఊరిలో కనీసం నాలుగైదు జట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాలనీల్లో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా కాలనీల అసోసియేషన్లు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ పోటీలు సైతం నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాలతోపాటు కాలనీల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. బోగి పండుగకు ముందు రోజు చాలాచోట్ల పోటీల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు. కాలనీల్లో అసోసియేషన్ సభ్యులు పోటీల గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ పాల్గొనేలా ఒక్కొక్కరిని కలుస్తున్నారు.
సంబురంగా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తున్నారు. ఒక్కచోటకు చేరడం వల్ల సంబంధాలు మరింత మెరుగవుతాయని, కష్ట సుఖాలు పంచుకునేందుకు సమయమూ దొరుకుతుందని అసోసియేషన్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాలనీల్లో నెలకొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై కూడా ఇవి చర్చా వేదికలుగా మారుతున్నాయని అంటున్నారు.