ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీధుల్లో భోగి మంటలు వేసి ఇంట్లో ఉండే పాతవస్తువులను అందులో వేసి పీడ తొలగాలని ఇష్టదైవాలను వేడుకున్నారు.
చిన్నాపెద్ద గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు రకరకాల పిండి వంటలు చేశారు. గంగిరెద్దుల వారు, హరిదాసులు, బుడబుక్కల, జానపద కళాకారులు పల్లెల్లో సందడి చేశారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి ఆనందోత్సాహాల మధ్య పేరంటాలు చేసుకున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ