పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 12: దసరా సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభంకానుండగా.. గురువారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో వచ్చి ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి కొన్నిచోట్ల, మధ్యాహ్నం తర్వాత మరికొన్ని బడుల్లో బతుకమ్మ ఆడారు. పూలను అందంగా పేర్చి ఊరేగింపు నిర్వహించారు. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినులు బతుకమ్మ ఆడారు. బడుల్లో స్పీకర్ల సహాయంతో బతుకమ్మ పాటలు పెట్టుకుని.. ఉత్సాహంగా పండుగ జరుపుకొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ బృందంతో కలిసి బతుకమ్మ ఆడారు.
అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయమ్మ, కేజీబీవీ ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం, రాయపోల్, దండుమైలారం, చర్లపటేల్‌గూడ, ఉప్పరిగూడ, కప్పాడు, తులేకలాన్, ఎలిమినేడుతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో అలరించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి, బతుకమ్మల చుట్టూ పాట పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు.
ఆదిబట్ల : ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాల, మంగళ్‌పల్లి పటేల్‌గూడ ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో హెచ్ఎంలు పరమేశ్, బాబ్లీ, వరలక్ష్మి, ఉపాధ్యాయులు అరుంధతి, నాగలక్ష్మి, సునీత, యాదగిరిరెడ్డి, వెం కటేశ్, ఆంజనేయులు, సోలమాన్, శేఖర్ పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండలంలోని పలు పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మలు తయారు చేసి వేడుకలు జరుపుకొన్నారు. రంగురంగు పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : శంకర్పల్లి కస్తుర్బా కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ పండుగలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబురాలను జరుపుకొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖర్, శ్రీనివాసరావు, శ్రీనివాససాగర్, రాజు, శిరీష, సుజాత, శశికళ, కవిత, హారతి, విజయశ్రీ పాల్గొన్నారు.