శంకర్పల్లి, సెప్టెంబర్ 10 : గ్రామాలకు పచ్చని హారాన్ని తొడిగినట్టు, పుడమితల్లి పచ్చదనంతో పులకరించినట్టు.. మండలంలోని ఏ గ్రామం చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించడం గొప్ప విషయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అంచనాలకు మించి మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని గ్రామాల్లో ఇప్పటి వరకు 2లక్షల 65 వేల వరకు మొక్కలు నాటారు.
వాటిలో 2లక్షల పైచిలుకు మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. గ్రామాల్లో ఇంటింటికీ ఇచ్చిన మొక్కలు సుమారు లక్షా 40వేలు నాటగా, లక్షా 2వేల మొక్కలు సంరక్షించబడుతున్నాయి. పల్లెప్రకృతివనాల్లో నాటిన వాటిలో ప్రధానంగా మలబార్, బాదాం, మారేడు, గులాబీ, అల్లనేరేడు, జామ, బొప్పాయి, మునగ, ఉసిరి, నిమ్మ, శ్రీగంధం, మందారం, కృష్ణతులసి, మల్లే, గన్నేరు తదితర మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకర్షిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెంచిన మొక్కలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రతి రోజూ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీరు పోస్తూ, కలుపు మొక్కలను తొలగించి వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మనం నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పల్లె ప్రకృతి వనాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. గ్రామాల్లో నాయకులు, అధికారుల కృషితో హరితహారం విజయవంతంగా నడుస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని రోల్ మాడల్‌గా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
– గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ
నాడు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. స్వరాష్ట్రం సాధించిన తరువాత గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందాయి. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందాయి.
-రాజూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్