శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Oct 10, 2020 , 01:46:16

పాడిపరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

పాడిపరిశ్రమాభివృద్ధికి  ప్రభుత్వ ప్రోత్సాహం

కడ్తాల్‌: రాష్ట్ర ప్రభుత్వం పాడిపరిశ్రమాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌,  సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తాతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పాలశీతలీకరణ కేంద్రంలోని యంత్రాలను, కార్యాలయ భవనాలను, ల్యాబ్‌ రూంను పరిశీలించి, పాలశీతలీకరణ కేంద్రం కోసం  ప్రతిరోజు ఎన్ని లీటర్ల పాల సేకరణ జరుగుతుంది, ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ వ్యవసాయరంగానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. పాడి రైతులను ఆదుకోవడానికి పాల ప్రోత్సాహ ధరను పెంచడంతోపాటు సబ్సిడీపై ఆవులు, గడ్డి కోత యంత్రాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కడ్తాల్‌ పాలశీతలీకరణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పాలశీతలీకరణ కేంద్రానికి నూతన యంత్రాలు, కొత్త భవనాల నిర్మాణానికి, సిబ్బంది నియామకానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కడ్తాల్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్‌ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సబ్సిడీ ఆవులు, బర్రెల కోసం డీడీలు కట్టిన రైతులకు త్వరలోనే వాటిని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్‌ రాధిక, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ వీరయ్య, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్‌, కృష్ణయ్య యాదవ్‌, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, నాయకులు లాయక్‌అలీ, నర్సింహ, రాఘవచారి, మహేశ్‌, యాదయ్య, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.