ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 7 : వేసవి సెలవులు, సుముహూర్తాల కాలం కావడంతో ప్రస్తుతం సందడి మొదలైంది. దీంతో బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు శుభకార్యాలు, పెండ్లిళ్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటే 10 శాతం రాయితీ కల్పిస్తూ సంస్థ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు బుకింగ్ చేసుకుంటే అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులను రాయితీపై వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ప్రైవేటు వాహనదారులను ఆశ్రయించి ఫిట్‌నెస్‌లేని వాహనాల్లో ప్రయాణం చేసి ఇబ్బందులు పడకుండా సురక్షితంగా, సుఖమయంగా అతిడతక్కువ ఖర్చుతో ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఫిట్నెస్ ఉన్న బస్సులు.. సీనియర్ డ్రైవర్లు..
పెండ్లిళ్లు, శుభకార్యాలకు అద్దెకు ఇచ్చే బస్సులు పూర్తి ఫిట్నెస్తో పాటు కొత్త బస్సులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు పూర్తి అనుభవం కలిగిన డ్రైవర్లు ఉన్నందున సమయపాలన పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని తెలిపారు.
ముహూర్తాల నేపథ్యంలో..
ఈ నెలలో 14కు పైగా, ఏప్రిల్ నెలలో చాలా ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. తర్వాత ముహూర్తాలకు మంచి రోజులు లేకపోవడంతో బ్రేక్ పడే అవకాశం ఉంది. మళ్లే మే, జూన్ నెలల్లో శుభకార్యాలున్నాయి. ఈ సీజన్లో వాహనాల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటంతో పాటు సంస్థ ఆదాయం పెంచుకునే ఆలోచనతో ఆర్టీసీ బస్సులను 10 శాతం రాయితీతో అద్దెకు ఇచ్చేలా అధికారులు ప్రకటించారు. దీనిపై కళాజాత ద్వారా ఆర్టీసీ ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించింది.
ఆర్టీసీ అద్దె చార్జీలు
ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేవారికి ఆర్టీసీ 10శాతం రాయితీ కల్పిస్తూ రేట్లను ఫిక్స్ చేసింది. ఒక్కొక్క బస్సుకు 6గంటలకు రూ.9057, 8గంటలకు రూ.10,569, 10గంటలకు 11,892, 12గంటలకు రూ.13,593, 14గంటలకు 15294, 16గంటలకు 15,815లను ఫిక్స్‌చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– అశోక్‌రాజు, ఆర్టీసీ డీఎం, ఇబ్రహీంపట్నం డిపో
పెండ్లిళ్ల సీజన్లో 10శాతం రాయితీపై ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తున్నాం. అవసరమైనవారు నేరుగా డిపోల్లోగానీ, ఆర్టీసీ వెబ్సైట్లోగానీ సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ 10 శాతం రాయితీని జూన్ 30 వరకు ఆఫర్ పొడిగించింది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిం పెద్దమొత్తంలో డబ్బులు వృథా చేసుకోకుండా ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.