ఈ నెల 18 వరకు జాతర
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
మంచాల, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వేణుగోపాలస్వామి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. వేణుగోపాలస్వామి ఉత్సవ ఏర్పాట్లు సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు. అదే విధంగా వేణుగోపాలస్వామి, రుక్మిణీదేవీల కల్యాణాన్ని నిర్వహించేందుకు కల్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం కలశస్థాపన, అంకురార్పణతో జాతర ప్రారంభమవుతుంది. 15న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠహోమం, 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8:15 గంటలకు కల్యాణ మహోత్సవం జరుగును. 16న ఉదయం 8:15 గంటలకు హోమం కార్యక్రమం, సాయంత్రం 5:15 గంటలకు కల్పవృక్ష సేవ, రాత్రి 7:20గంటలకు రథంగ హోమం, 17న ఉదయం 6: 35 గంటలకు వేణుగోపాలస్వామి దేవాలయం నుంచి రథంపై విగ్రహమూర్తుల ఊరేగింపు, 18న ఉదయం 8:15 గంటలకు హోమం, సాయంత్రం 5:35 గంటలకు నాగవల్లి, రాత్రి 7గంటలకు పూర్ణాహుతితో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో రథోత్సవం సందర్భంగా ప్రత్యేక కళాకారులు ఆటాపాటలతో ప్రజలను అలరిస్తారు.
నేటి నుంచి సంగమేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్ : మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీన రుద్రహోమం, విఘ్నేశ్వర పూజ, సుబ్రమణేశ్వరస్వామి వారి అభిషేకం, ధ్వజారోహణం, రుద్రాభిషేకం, అగ్నిగుండాలు, 16వ తేదీన స్వామివారికి అభిషేకం, రథోత్సవం,17వ తేదీన సత్యనారాయణ స్వామి వ్రతం, పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం, అమ్మవారికి ఒడిబియ్యాలు, స్వామి వారి పల్లకీ సేవలు, 18వ తేదీన మహామంగళ హారతి తీర్థప్రసాదం, అన్నదానం, స్వామి వారి దివ్య రథోత్సవం ఆలయం నుంచి కనకమామిడి గ్రామం వరకు ఉంటుందని ఆలయ అర్చకులు ప్రభులింగం, గౌరీశంకర్, సోమయ్య తెలిపారు.