రంగారెడ్డి జిల్లాలో 1,338 స్కూళ్లకు 33 శాతం బడుల ఎంపిక
మన ఊరు-మన బడి కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పన
వారంలోగా పనుల ప్రణాళికను సిద్ధం చేసేందుకు చర్యలు
వచ్చే విద్యా సంవత్సరం అందుబాటులోకి ఆంగ్ల మాధ్యమం
విద్యార్థులు అధికంగా ఉన్న స్కూళ్లకు మొదటి విడుత ప్రాధాన్యం
పేద విద్యార్థులకు చేరువకానున్న ఇంగ్లిష్ మీడియం
హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
రంగారెడ్డి, ఫిబ్రవరి 18, (నమస్తే తెలంగాణ) ;విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధిక నిధులనూ కేటాయించనున్నది. తొలి విడుతగా విద్యార్థులు అధికంగా ఉన్న స్కూళ్లకు ప్రాధాన్యతనిస్తూ రంగారెడ్డి జిల్లాలో 33 శాతం పాఠశాలలను ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా 1,338 స్కూళ్లు ఉండగా, 464 స్కూళ్లు ఎంపికయ్యాయి. ఎంపికైన స్కూళ్లలో ఏఏ వసతులు సమకూర్చాలో వారంలోగా ప్రణాళికను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే ఉచితంగా పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు అందుతుండడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం చేరువకావడం వరంగా మారనున్నది. తమ పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర సర్కార్ బంగారు బాటలు వేస్తుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ బడులు మరింత బాగుపడేలా.. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలను ముమ్మరం చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో మౌలి క వసతులు కల్పించడంతోపాటు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్లో అధిక నిధులను కేటాయించి బడులకు మహర్దశ తీసుకొచ్చేందుకు ప్రణాళికను రూపొందించారు. రానున్న మూడేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 33శాతం మేర పాఠశాలలను ఎంపిక చేసి మొదటి విడుతలో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నారు. అంతేకాకుండా ఒకటి నుంచి పదోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులను ఉచితంగా అందిస్తుండటం, పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రైవేట్‌కు దీటుగా ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.
తొలి విడుతలో 33 శాతం బడుల ఎంపిక
‘మన ఊరు-మన బడి’లో భాగంగా రానున్న మూడేండ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించి వాటి రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి విడుతగా విద్యార్థులు అధికంగా ఉన్న 33 శాతం బడులను ఎంపిక చేసి ప్రభుత్వం వసతులను కల్పించనున్నది. మిగతా అన్ని పాఠశాలల్లో రానున్న రెండేండ్ల కాలం లో కల్పించనుంది. అయితే జిల్లాలో 1,338 స్కూళ్లుండగా తొలి విడుతలో 464 పాఠశాలలను అధికారులు మొదటి విడుతలో ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు-261, ప్రాథమికోన్నత పాఠశాలలు- 58, ఉన్నత పాఠశాలలు- 145 ఉన్నాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 30 శాతం మేర బడులను ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆయా మండలాల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న బడులను కూడా పరిగణనలోకి తీసుకొని తొలి విడుతలో ఎంపిక చేశారు. అయితే వచ్చే విద్యాసంవత్సరంలో మౌలిక వసతులు కల్పించనున్న 464 పాఠశాలలకు సంబంధించి ఎంత బడ్జెట్ కావాలనే దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు.
తొలి విడుతలో ఎంపికైన బడుల్లో ఏ, ఏ వసతులను కల్పించాలనే దానిపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. వారం రోజుల్లో ఎంపిక చేసిన బడుల్లో వసతుల కల్పనకు ఎన్ని నిధులు కావాలనేది స్పష్టత రానుంది. దాని తర్వాత ప్రభుత్వానికి అంచనాలను జిల్లా విద్యాశాఖ అధికారులు సమర్పించనున్నారు. అయితే బడుల్లో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులను పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా లేదా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారా అనేది కూ డా వారంలోగా తేలనున్నది. మన ఊరు-మన బడిలో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మా ణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు తదితర పనులకు అంచనాలను రూపొందిస్తున్నారు.
–