రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల విక్రయాల్లో దళారులదే పైచేయిగా మారింది. వారు రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఒక్క రోజు కూడా నిల్వ ఉంచకుండా కొంటూ.. రైతుల వడ్లను త్వరగా కాంటా చేయకపోవడంతో వారు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మంచాలలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతోనే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇటీవల జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులు ముందుగానే పంటను కోశారు. కోసిన ధాన్యం కల్లాల వద్దే పచ్చిగా ఉన్నా దళారులు రూ.2000 లోపే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ వడ్లను ఆరబెట్టి, నిల్వ చేసి తమకు అనుకూలంగా ఉన్న రైతుల పాస్బుక్కులతో కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే సంబంధిత రైతుల నుంచి వ్యాపారులు చెక్కులు తీసుకుని వారి పేర్లపై వడ్లను విక్రయిస్తున్నారు. ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమయిన వెంటనే ఆ డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. కాగా జిల్లాలో అధికారులు 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లోనూ దళారులదే పైచేయిగా మారింది.
కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉన్నది. సరిపడా కూలీలు లేకపోవడంతో రైతుల ధాన్యం తూకం వేసేందుకు మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.