శుక్రవారం 29 మే 2020
Rajanna-siricilla - Feb 02, 2020 , 00:43:56

ఆశ నిరాశే..

ఆశ నిరాశే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-2021 బడ్జెట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అసంతృప్తే మిగిల్చింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని ఆశించినా, నిరాశే ఎదురైంది. కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం, పాత ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కల్పిస్తున్న కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద గోడౌన్లు నిర్మించాలన్న ప్రతిపాదనను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. ఆదాయ పన్ను పరిమితి విషయంలోనూ స్పష్టత లేకపోవడం, పైగా కొత్తగా రెండు విధానాలు ప్రకటించడం ఉద్యోగవర్గాలను గందరగోళానికి గురిచేస్తున్నది. మరోవైపు అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీని లిస్టింగ్ చేస్తామనడంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రం ఊసే ఎత్తకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ మండిపడగా, అంత ఆశాజనకంగా ఏమీ లేదని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, తెలంగాణకు ప్రోత్సాహకలను ప్రకటించలేదని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు.

- కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ పద్దును నిశితంగా పరిశీలిస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఉమ్మడి జిల్లా కోణంలో చూసినా.. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల కోణంలో చూసినా అసంతృప్తే మిగిల్చింది. ఇటు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతుబంధును కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రస్తావించినా, బడ్జెట్‌లో మాత్రం రైతుబంధుకు నిధులు కేటాయించకపోవడం, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పినా.. అది ఎలాగో చెప్పకపోవడంపై నిరాశే వ్యక్తమైంది. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణకు ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై నిరాశ చెందారు. కేంద్రం కావాలనే మొండి చేయి చూపుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కాళేశ్వరం ఊసే లేదు..

తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పూర్తి చేసి, తన సత్తాను చాటింది. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రం కేంద్రాన్ని చాలాకాలంగా కోరుతున్నది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విజయపరంపరను దృష్టిలో పెట్టుకొని అయినా కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశించింది. కానీ, బడ్జెట్‌లో కాళేశ్వరం ఊసే ఎత్తలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా నిధులు కేటాయిస్తున్నట్లుగా చెప్పలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కేవి. అంతేకాదు, ఉమ్మడి జిల్లాకు ఎక్కువ లాభం చేకూరేది. కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేస్తున్నట్లుగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. లక్షలాది ఎకరాలకు నీళ్లందించే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్ వ్యక్తం అవుతున్నది. 


logo