ఒకే విషయాన్ని గురించి పదే పదే చర్చిస్తూ.. పరిష్కారం గురించి పట్టించుకోకుండా ఆ ఆలోచనల్లోనే మునిగితేలుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకునే వారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. వానరం అంటేనే చంచలత్వానికి ప్రతీక. ఒకచోట నిలవదు. ఒకవేళ కోతికి పుండు పుడితే.. దాన్నే చూస్తూ, గోకుతూ, నాకుతూ మరింత తీవ్రం చేసుకుంటుంది. ఒక్కోసారి అది రాకాసి పుండుగా మారి.. ఇన్ఫెక్షన్ కారణంగా మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టే, ‘కోతికి పుండైతే గోకా.. నాకా అన్నట్లు.. ఎందుకురా పదే పదే అదే ఆలోచిస్తవ్. వేరే ఏదైనా పని చేసుకోవచ్చుగా’ అంటుంటారు పెద్దలు, అర్థంలేని ఆలోచనల నుంచి మన దృష్టి మళ్లించడానికి. ఇలాంటి చంచల మనస్కులు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. ఏదైనా ఆలోచనపడితే అందులోనే మునిగితేలతారు. ఎవరిపైన అయినా అనుమానం ఉంటే.. నిద్రాహారాలు మానుకొని మరీ వాళ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటూ బుర్ర పాడు చేసుకుంటారు. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారమని గ్రహించక మనోవ్యాధికి గురవుతారు.
సోగి తొక్కు యాదికుందా!
తెలంగాణలో తొక్కు(పచ్చడి) ప్రాధాన్యమే వేరు. కాలం ఏదైనా పచ్చళ్లను పళ్లెం అంచుకు వేసి, నంజుకోనిది ముద్దదిగదు. ఏ కూరగాయనైనా తొక్కుగా మార్చే నైపుణ్యం మన నలభీములది. కాలం మారుతున్న కొద్దీ తొక్కుల సంఖ్య తగ్గుతున్నా.. అన్నంలో నంజుకోవడానికి నేటికీ ‘సోగి తొక్కు’ అలానే ఉంది. ‘సోగి తొక్కు’ అంటే మరేదో కాదు మామిడికాయ పచ్చడి. పూర్వం మామిడికాయ, నిమ్మకాయ, టమాట తదితర పచ్చళ్లు పెట్టేందుకు వీలుగా కారం, నువ్వులు, వెచ్చాలు, ఇతర దినుసుల పొడులతో కలిపి ఒక మిశ్రమాన్ని సిద్ధంగా ఉంచుకునే వారు. దానిని ‘సోగి/ సోగికారం’ అనేవాళ్లు. ముక్కలు కలిపేటప్పుడు, రుబ్బేటప్పుడు ఈ సోగి మిశ్రమాన్ని కలిపేవారు. ఎక్కువగా మామిడి తొక్కుకు ఇలా ఉపయోగించడంతో కొన్ని ప్రాంతాల్లో మామిడికాయ పచ్చడిని ‘సోగి తొక్కు’ అని కూడా పిలుస్తారు.
మింగేదిడిసి కోళ్లు గొట్టబొయ్యిండట
రంగం ఏదైనా కానీ, అందులో తమ పని ప్రాధాన్యం తెలియని వ్యక్తుల గురించి చెప్పిన సామెత ఇది. ఇలాంటివారు తరచూ తారసపడుతుంటారు. అప్పటిదాకా చేస్తున్న పనిని పక్కనపెట్టి.. అవసరం లేని పనికి పూనుకుంటారు. ఆ నిమిషానికి తోచిన వ్యవహారమేదో నెత్తిన వేసుకుంటారు. అది ఎంతపెద్ద తప్పు అనేది గ్రహించరు. ఇంకొకరు చెప్పినా వినరు. ఇలాంటి స్వభావం ఉన్నవారు చేసే పనికి ప్రాధాన్యం ఇవ్వరు. ఒక వ్యక్తికి తినడం అనేది కనీస అవసరం. సమయానికి తింటేనే బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది మింగేది/ తినేది విడిచిపెట్టి.. కోళ్లను గెదమడానికి పోవడం అవివేకం. అన్నం తినడాన్ని దైవకార్యంగా భావిస్తారు. అన్నాన్ని గౌరవిస్తూ పీటపై కూర్చోవడం, తినేటప్పుడు మాట్లాడకపోవడం, తొలిముద్దను కండ్లకు అద్దుకోవడం.. నేటికీ తెలంగాణ పల్లెల్లో చూస్తుంటాం. అందుకే చేసే పని ఎంత ముఖ్యమో మొదట తెలుసుకోమని అంటారు పెద్దలు.
అర్థ వివరణ
1. సతాయించుడు = వేధించడం (ఎందుకురా ఆ పిల్లను పొద్దుగాల్నుంచే మస్తు సతాయిస్తున్నవ్)
2. రాజిర్కం = పెత్తనం, రాజరికం (మా వాడకట్టులో నీ రాజిర్కం ఏందిరా అయ్యా)
3. బొంబాట్ = అందంగా/ అద్భుతంగా/ బ్రహ్మాండంగా (పిల్ల బొంబాట్గా ఉన్నా.. బుద్ధి సక్కంగ లేకపాయె)
4. మత్తడి దుంకుడు = అలుగు పారడం (మండుటెండల్లో కూడా మన చెరువు మత్తడి దుంకుతున్నది బిడ్డా)
5. యాతంబోసుడు = తీరికలేకుండా పనిచేయడం/ విరామం లేకుండా కష్టపడటం
– డప్పు రవి