Israel Hamas War | గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి ఏడాది పూర్తయినా, పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దుస్సాహసిక దాడితో మొదలైన ఘర్షణ దీర్ఘకాలిక యుద్ధంగా మారింది. నిజానికి దీన్ని యుద్ధం అనే కన్నా ఇజ్రాయెల్ ఏకపక్షంగా జరుపుతున్న విధ్వంసం అనడం సబబు. హమాస్ మిలిటెంట్లు నిరుడు అక్టోబర్ 7న జరిపిన దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీలు హతమయ్యారు. మరో 250 మందిని వారు బందీలుగా పట్టుకుపోయారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఎదురుదాడులు మొదలుపెట్టింది. మొదట్లో క్షిపణులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ తర్వాత గాజాలోకి సైన్యాన్ని పంపి భూతల యుద్ధాన్ని మొదలుపెట్టిం ది. ఈ ఏడాది కాలంలో గాజా ముఖచిత్రమే మారిపోయింది. దాదాపుగా అక్కడి భవనాలన్నీ బూడిదయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 42 వేల మంది గాజా పౌరులు హతమయ్యారు. వారిలో మహిళలు, పసివాళ్లే అధికం. ఇదిలా ఉంటే అటు లెబనాన్‌లో మరో మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా.. హమాస్‌కు సంఘీభావంగా రాకెట్లు వేస్తుండటంతో అక్కడ కూడా ఇజ్రాయెల్ భూతల యుద్ధం మొదలుపెట్టింది. ఇవి రెండూ ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పరోక్ష యుద్ధాలే. నేడో రేపో ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడికి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. అంటే ఏడాదిలో గాజా ఘర్షణ మూడు ప్రాంతాల యుద్ధంగా పరిణమించింది తప్ప, గాజా పౌరులకు ఉపశమనం అనేదే దక్కలేదు.
మొదట ఆక్రమణదారు, ఆపై అణచివేతదారుగా మారిన ఇజ్రాయె ల్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆత్మరక్షణకు ఇజ్రాయెల్ ఇస్తున్న నిర్వచనమే అందుకు కారణం. గాజాలో దాడుల కు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా కేసు దాఖలు చేసింది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం అమెరికా వర్సిటీలు పాలస్తీనా అనుకూల బైఠాయింపులు, ధర్నాలతో దద్దరిల్లాయి. ఏడాది లో ఇజ్రాయెల్ తన మొండి వైఖరితో ఏకాకిగా మారుతుండటం మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్‌కు ఆయుధాల అమ్మకం నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయించడం గమనార్హం. మరికొన్ని దేశాలు ఇదే బాటన వెళ్లే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏకైక అగ్రరాజ్యం అమెరికా మాత్రం పాలస్తీనీయుల పట్ల ఓ పక్క సానుభూతి ప్రకటిస్తూనే ఇజ్రాయెల్ యుద్ధ సంసిద్ధతకు అన్నివిధాలా అండదండలు అందిస్తూ ఉన్నది.
2020లో అరబ్బు దేశాలు, ఇజ్రాయెల్ మధ్య ఓస్లోలో కుదిరిన ఒప్పందం పశ్చమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోయింది. అందుకు పాలస్తీనా సమస్యే కారణం. పాలస్తీనీయులకు అండగా నిలిచిన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు బద్ధవిరోధిగా మారి, యుద్ధం అంచున నిలిచింది. గాజాతో మొదలైన సమస్య ఒకటి రెండు దేశాలకు పరిమితం కాదనేది వాస్తవం. యుద్ధం దేశాల మధ్య జరిగినా అందులో నలిగిపోయేది ఇరువైపులా ఉన్న సామాన్యులే. గూడు చెదిరి నిరాశ్రయులయ్యేదీ వారే. గాజాలో నిత్య నరకం అనుభవిస్తున్న ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. ఇది మానవతావాదానికి, నాగరికతకు మచ్చగా నిలుస్తుంది. ఇప్పటికైనా పశ్చిమదేశాలు గాజా హననాన్ని ఆపేందుకు ముందుకు రావాలి. రెండు దేశాల సూత్రమే సరైన పరిష్కారమనే సత్యాన్ని చిత్తశుద్ధితో అంగీకరించాలి. ఇజ్రాయెల్‌తో సమానంగా మనుగడ సాగించే హక్కు పాలస్తీనీయులకూ ఉంది. దానిని గుర్తిస్తే గాజా కల్లోలానికి ముగింపు పలకడం సాధ్యమే.