నేడు గాడ్గే బాబా వర్ధంతి
సాధు సంతుల పురిటిగడ్డ అయిన మహారాష్ట్రలో గొప్ప సంస్కర్తగా పేరు పొందిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా. మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత మహారాష్ట్రపై అత్యంత ప్రభావం చూపిన సంఘసంస్కర్త ఆయన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురూజీ అని ప్రేమగా పిలుచుకున్న సామాజిక కార్యకర్త గాడ్గే బాబా.
మహారాష్ట్ర సమాజంపై సంత్ గాడ్గే సామాజిక బోధనల ప్రభావం చాలా ఉన్నది. గాడ్గే బాబా కార్యకలాపాలకు, వ్యక్తిత్వానికి, భావజాలానికి ముగ్ధులై బీఆర్ అంబేద్కర్ ఆయనను గురువుగా సంబోధించేవారు. అంబేద్కర్ మతం మార్చుకుందామని భావిస్తున్న సమయంలో తాను అభిమానించే గాడ్గే బాబాను సలహా కోరారు. ‘నేను చదువుకున్నవాడిని కాను, నీవే ధర్మాల మర్మాలు ఆలోచించగలిగిన వాడివి. నిన్ను లక్షల మంది అనుసరిస్తారు కాబట్టి హిందూ మతానికి హాని కలగకుండా మాత్రం చూడు’ అని సలహా ఇచ్చారు సంత్ గాడ్గే బాబా.
మహాత్మాగాంధీ సైతం సంత్ గాడ్గే భావాలకు, ఆచరణకు ముగ్ధుడై బాబాను సందర్శించాలని భావించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్రోద్యమ నాయకుడు బీజీ ఖేర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో మహారాష్ట్రలో పర్యటిస్తున్న మహాత్మా గాంధీకి గాడ్గే కార్యకలాపాల గురించి వివరించగా ఆయనను కలవాలన్న కోరిక వ్యక్తపరిచారు. కొన్నేండ్ల తర్వాత గాడ్గే బాబా గాంధీజీ సేవాశ్రమానికి దగ్గరలోని వార్ధాకు విచ్చేసిన సమయంలో వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించి కలిశారు. గాంధీజీని కలిసినప్పుడు వారిద్దరూ సమాజంలోని అవిద్యను, అంటరానితనాన్ని, దుర్వ్యసనాలను రూపుమాపడం వంటి విషయాలపై చర్చించారు.
అలానే అప్పటికే గాడ్గే బాబా ఆయా విషయాల్లో చేసిన విశేషమైన కృషిని తెలుసుకున్న గాంధీ ఆయనను అభినందించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజీ ఖేర్, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన పంజాబ్ రావు, బాబూరావ్ పాటిల్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ జీడీ తాపసే, పాత్రికేయులు అనంత్ హరిగద్రే, ప్రబోధాంకర్ థాక్రే, మరాఠీ రచయిత పీకే ఆత్రే, జీఎన్ దండేకర్ సహా ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులు. వారందరూ ఆయన ప్రారంభించిన చీపురు దండులో సభ్యులుగా పనిచేసిన వారే.
దేశంలోని పలు రాజకీయపక్షాలూ, సేవాసంస్థలు సంత్గాడ్గే బాబాను స్ఫూర్తిగా తీసుకోవడం వెనుక గల ప్రధాన కారణమేమంటే.. ఆయన సుప్రఖ్యాతుడైన సాధువు, సంఘసంస్కర్త. సంచార భిక్షువు. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ-సక్కుబాయి. వారు రజక కులంలో జన్మించినా తండ్రితాతల కాలం నుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు.
దేబూజీ తన 29వ ఏట 1904, ఫిబ్రవరి 5న కుటుంబాన్ని అర్ధరాత్రి వేళ విడిచిపెట్టి వెళ్లిపోయారు. అనంతరకాలంలో ఆయన సన్యాసం స్వీకరించి గాడ్గేబాబాగా సుప్రసిద్ధులయ్యారు. దేబూజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక రంగురంగుల పీలికలను
కలిపికట్టుకునేవారు. ఆయన భిక్షను స్వీకరించే మట్టిపాత్ర (మరాఠీలో గాడ్గే) తలపై పెట్టుకుని తిరుగుతుండటంతో ఆయనను గాడ్గే బాబాగానూ, గాడ్గే మహరాజ్గానూ పిలిచేవారు.
గాడ్గే బాబా ఆధ్యాత్మిక విషయాలను బోధించడంతో పాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, సేవాకార్యక్రమాలు చేపట్టడం వంటివి చేసేవారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం, దాహంతో అలమటిస్తున్నవారికి నీరు, దుస్తులు లేనివారికి వస్ర్తాలు, పేదలకు నాణ్యమైన విద్య, రోగులకు వైద్యం, తలదాచుకునేందుకు నివాసం, జంతువులకు రక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు ఆలంబన, పేద యువతీయువకులకు వివాహం జరగాలని ఆశించి, అందుకోసం జీవితమంతా కృషిచేశారు.
భక్తులను ప్రోత్సహించి, వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, ఆస్పత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు. వందలాది సేవాసంస్థలను, ట్రస్టులను నిర్మించిన బాబా తన కుటుంబసభ్యులను, బంధువులను ఆయా ట్రస్టుల్లోని పదవుల్లో నియమించకుండా సేవాభిలాష ఉన్న సహచరులనే ఎంపికచేసి నియమించడం విశేషం. సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని, చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు. ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా పేరు పొందారు.
బాబా కులవివక్షను, కులతత్త్వాన్నీ తీవ్రంగా వ్యతిరేకించేవారు. పండరిపూర్లో స్వామివారి ఉత్సవాలు వర్షాకాలంలో జరిగేవి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు దూరతీరాల నుంచి వచ్చి పాల్గొనే భక్తులతో క్షేత్రమంతా కిక్కిరిసిపోయేది. అప్పట్లో ఆలయ ప్రవేశార్హత లేక కేవలం ఆలయంపై ఉండే కలశాన్ని చూసేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే దళిత కులస్థుల ఇక్కట్లు మరీ ఎక్కువగా ఉండేవి. వారి ఇబ్బందులను గమనించిన గాడ్గే బాబా భక్తులు, ప్రజల సహకారాలను అర్థించి అక్కడ చొక్క మేళా పేరుతో ఓ ధర్మశాల నిర్మించారు. దళిత భక్తుల కోసం కట్టించిన తొలి ధర్మశాలగా ఇది ప్రఖ్యాతి పొందింది. సమాజం నుంచే కాకుండా అత్యంత సన్నిహితుల నుంచి కూడా దూరమై దారుణమైన వివక్షను అనుభవిస్తున్న కుష్ఠురోగులకు సేవచేసేందుకు గాడ్గే బాబా వారికి సేవాశాలలు నిర్మించి, సేవా కార్యకలాపాలు చేపట్టారు.
1876 ఫిబ్రవరి 23న జన్మించిన సంత్ గాడ్గే బాబా 1956 డిసెంబరు 20న అమరావతి వెళ్తుండగా పేధీ నదీతీరాన వలగావ్ దగ్గర తనువు చాలించారు. గాడ్గే బాబా మరణానంతరం కూడా ఆయన కృషికి వివిధ రూపాల్లో గౌరవం లభిస్తూనే ఉన్నది. 2001లో వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గ్రామస్థాయి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ‘సంత్ గాడ్గే బాబా గ్రామ్ స్వచ్ఛతా అభియాన్’ పేరిట పథకాన్ని తయారుచేసి అమలుపరచడం విశేషం.
– ఎడిటోరియల్ డెస్క్