తెలంగాణకు తారీఖులు, దస్తావేజులు వెతుక్కోవాల్సిన పనిలేదు. అది ఎవరో రాసిన చరిత్ర కాదు. గుర్తుపెట్టుకుని మననం చేసుకోవటానికి. తెలంగాణ అసలు పేరు అస్తిత్వం. అది ప్రజల ఆశల్లో ఆకాంక్షల్లో ఉంటది..అస్తిత్వం, తెలంగాణ సంస్కృ తి, తెలంగాణ జీవన విధానం. నువ్వు తెలంగాణలో ఉన్నంత మాత్రాన తెలంగానైట్వి కాలేవు. నీ భావనలో, ఊపిరిలో తెలంగాణ ఉండాలి. నీ గుండెల్లో, నువ్వేసే అడుగుల్లో, నువ్వు చేసే ఆలోచనలో, నీ ఊహలో, నీ ఊపిరిలో తెలంగాణ ఉండాలి.
తెలంగాణ పేరు చెప్పి వెన్నులో పొడిచేవాళ్లను ఏరేసి, అధికార పల్లకిలో ఉంటే దించేసి, ఎవరి మాస్క్‌తో, ఎవరి ముఖంతో దాడి చేస్తున్నారో ముసుగులు చీల్చేసి, తెలంగాణ తనానికి పట్టం కట్టాలి. గుండెల్లో ఉండాలి, వేసే అడుగుల్లో ఉండాలి, నడిచే నడతల్లో ఉండాలి. ఆధిపత్యం, అధికారం ఫినిక్స్ పక్షిలాంటివి. బూడిదలోంచి ఎప్పుడైనా లేచివస్తాయి. ఆనవాళ్లు పోయినోడిని బతికించే అధికార శక్తిని తుత్తునియలు చేయాలి. రెండుకండ్ల సిద్ధాంతాల విషనాగులు విషం చిమ్ముతుంటే తెలంగాణకు తెగింపు కొత్త కాదు. నిగ్రహం తప్పితే, ఆగ్రహం కట్టు తెగితే ఏమైతదో మన ట్యాంక్‌బండ్‌ని అడుగు, సమరోత్సవాల సాగరహారం, సడక్ బంద్‌లను అడుగు..అన్నతమ్ముల కథలైతే ఆ కత వేరు. యజమాని బానిస కథలైతే ఆ కత వేరు, విభజన రేఖ మీద దురాక్రమణలైతే వాడు తన వాడైనా పరవాడైనా ఏ ముఖంతో వచ్చినా చీరి ఎండేయక తప్పదు.
బాబూ! పెట్టుబడి పళ్లతో తెలుగుజాతి విషపు కత్తితో నువ్వు పొడవని పోటుందా? చేయని విధ్వంసం ఉన్నదా?బాబు..తెలంగాణ అస్తిత్వం పై అప్పటికీ, ఇప్పటికీ నీ కుట్రల కొనసాగింపే మా బిడ్డలు పడ్డ అగచాట్లు, చేసిన త్యాగఫలం కదా తెలంగాణ రాష్ట్రం.
నక్కలు కాపు కాస్తయ్..కుట్రలు ఎదురు చూస్తాయ్.. తెలంగాణ వచ్చినా మీ కుట్రల జాడలు పోలే. రవీంద్రభారతిని వదిలిపెట్టలే..తెలంగాణ తల్లి విగ్రహాలపై దాడులు మానలే. స్వరాష్ట్ర పోరులో కుట్రదారులంతా ఒక్కటై అస్తిత్వంపై కత్తి కట్టిండ్రు. స్వరాష్ట్రంలోనూ ఈ ఆధిపత్యాల పీడలు పోలే..గోతి కాడ అన్నుబట్టి అదును కోసం చూస్తున్నయ్ ఇప్పుడు..రాష్ట్ర రక్షణ మా ప్రాణం, తెలంగాణ మా మతం, తెలంగాణ అస్తిత్వం బహుజన అస్తిత్వం, తెలంగాణనే సామాజిక నినాదం.
-జూలూరు గౌరీశంకర్