మత్స్యకారులను నిండా ముంచిండ్రు
రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలను కల్లోల పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఎల్ నినో దృష్టాంతాన్ని సాకుగా చూపిస్తూ పంటల సాగును నిలిపివేయాలంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెగేసి చెప్పడంతో రైతులకు వ్యవసాయం మీద ఆశలు ఆవిరైపోయాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున పునరుద్ధరించిన సాగునీటి వనరులతో మత్స్యకారుల్లో భవిష్యత్తు పట్ల ఆశలు చిగురించాయి. కానీ నేటి కాంగ్రెస్ పాలకుల హయాంలో వారి ఆశలు నీటి మీది బుడగల్లా తేలిపోతున్నాయి. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలు ఒకవైపు తమకున్న చిన్న కమతాలను సాగు చేసుకుంటూనే, మరోవైపు చేపల వృత్తిపై ఆధారపడి బతుకు భరోసా పొందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న అభివృద్ధి వ్యతిరేక వైఖరి ఫలితంగా ఒకవైపు నీటి ఎద్దడితో పొలాలు ఎండిపోయి, మరోవైపున చెరువుల్లో చేపపిల్లలు వదల్లేని దుస్థితిలో ‘రెంటికీ చెడ్డ రేవడి’లా ప్రభుత్వ ప్రాయోజిత కరువుతో మత్స్యకారులు తల్లడిల్లిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలను కల్లోల పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఎల్ నినో దృష్టాంతాన్ని సాకుగా చూపిస్తూ పంటల సాగును నిలిపివేయాలంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెగేసి చెప్పడంతో రైతులకు వ్యవసాయం మీద ఆశలు ఆవిరైపోయాయి. మరోవైపున చెరువుల్లో నీటి సామర్థ్యం అడుగంటిపోతున్న నేపథ్యంలో ఈ సీజన్లో ఇప్పటికే పూర్తిచేయాల్సిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అటకెక్కించారు. దీంతో రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎల్ నినో సృష్టిస్తున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం తగ్గిపోయి, భూగర్భజలాలు అడుగంటిపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకల సమస్యలకు సాకుగా చూపే దుస్సాహసం చేస్తున్నది. గోదావరి నదిపై కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసి, పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు, చెరువులను నింపేందుకు వీలున్నది. కానీ కాంగ్రెస్ పాలకులు అన్ని అవకాశాలను తమ వికృత రాజకీయ క్రీడలో భాగంగా బుద్ధిపూర్వకంగానే విస్మరించారు. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసుకొని, జలవనరులను నింపుకొని, చెరువులకు తరలించడం ద్వారా వేసవిలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వీలున్న అవకాశాలను కావాలనే జారవిడిచారు. రాష్ట్ర రైతాంగంతోపాటు, అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వ ప్రాయోజిత కరవు పరిస్థితుల్లోకి నెట్టివేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆడుతున్న ఈ వికృత చేష్టల ఫలితంగా రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకార కుటుంబాలు తమ భవిష్యత్తుకు భరోసా లేక, ఉపాధి కరువై తల్లడిల్లిపోతున్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం 2016లో చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత వరకు నిరాటంకంగా ఏటా ఈ పథకాన్ని అమలు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి కేవలం 2.40 లక్షల టన్నులుగా ఉన్న చేపల వార్షిక ఉత్పత్తి కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే రెట్టింపు అయ్యింది.
పర్యవసానంగా రాష్ట్రంలోని మత్స్యకారులు వార్షిక ఆదాయాల్లో కూడా గణనీయమైన వృద్ధిరేటు నమోదయ్యింది. అప్పటివరకూ పూర్తి నిర్లక్ష్యానికి గురైన మత్స్యకార వృత్తి తెలంగాణలో ఒక గౌరవనీయమైన వ్యాపకంగా మార్పు చెందింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేండ్ల కాలం నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అటకెక్కించేందుకు దశలవారీగా కుట్రలను అమలు పరుస్తున్నది. రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువుగా ఉన్న సుమారు 29 వేల నీటివనరుల్లో కనీసం 86 కోట్ల నుంచి 98 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్య శాఖ ఏటా ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తున్నది. ఇందుకు అనుగుణంగా ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం ఏటా సుమారు వంద కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం గత మూడేండ్లుగా ప్రతిసారీ ఆర్భాటంగా ప్రకటిస్తున్నది.
అయితే ఆచరణలో మాత్రం ఏ ఒక్క సంవత్సరంలోనూ మత్స్యశాఖ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో చేపపిల్లల పంపిణీ నిర్వహించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 56 శాతం మేరకు మాత్రమే ఉచిత చేపపిల్లలను వదిలినట్టు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 30 శాతం మేరకు మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
ఇక ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ వ్యవహారం ప్రహసనంగా మిగిలిపోయింది. జూలైలో ప్రారంభం కావాల్సిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం.. అక్టోబర్ దాటుతున్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే విచిత్రంగా ఏదో ముహూర్తం మించిపోయినట్టుగా గత నెల 29వ తేదీన వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, పలువురు మంత్రులు చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. కానీ రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలోనూ ఇంతవరకూ చేపపిల్లలను వదిలిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
ఈ సంవత్సరం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి రూ.130 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్టంలో ఎంపిక చేసిన 29 వేల నీటివనరుల్లో 86 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఆచరణలో ఇందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లూ కనిపించకపోవడంతో ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు ఉచిత చేపపిల్లల పంపిణీ విషయంలో ఆశలు వదులుకున్నాయి. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి ఇటీవల మీడియా సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాలు మత్స్యకారులను పూర్తి నిరాశానిస్పృహల్లోకి నెట్టేశాయి.
రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రానున్న యాసంగి (రబీ సీజన్) పంటలకు సెలవును ప్రకటించిన సర్కార్ అందుకు పరిహారంగా రైతులకు పలు రకాలైన కరువు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్టు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది.
జలాశయాలతోపాటు చెరువుల్లో తీవ్ర నీటి కొరత నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసే ప్రయత్నాలను కూడా ప్రభుత్వం పూర్తిగా విరమించుకున్నట్లు తేటతెల్లమవుతున్నది. అయితే, చెరువుల్లో చేపల సంపదపైనే ఆధారపడిన లక్షలాది మత్స్యకార కుటుంబాలను ఈ కరువు పరిస్థితుల నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలను తీసుకుంటుంది? అందుకు ఏ విధమైన కరువు సహాయక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకోవడానికి అమలు పరుస్తుంది? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధాన ప్రకటన వెంటనే వెలువరించాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం రాష్ట్రంలోని మత్స్యసహకార సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించుకుని అమలుపరచడం తక్షణ కర్తవ్యం. ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ ప్రాయోజిత కరువు కారణంగా ‘పరేషాన్’ కాకతప్పదు!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేండ్ల కాలం నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అటకెక్కించేందుకు దశలవారీగా కుట్రలను అమలు పరుస్తున్నది. రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువుగా ఉన్న సుమారు 29 వేల నీటివనరుల్లో కనీసం 86 కోట్ల నుంచి 98 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్య శాఖ ఏటా ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తున్నది. ఇందుకు అనుగుణంగా ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం ఏటా సుమారు వంద కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం మూడేండ్లుగా ప్రతిసారీ ఆర్భాటంగా ప్రకటిస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు)
పిట్టల రవీందర్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

