నా రెండు కాళ్ళూ సక్కగా పన్జెయ్యయి. అందుకే దేక్కుంటా నడుస్తా ఉండంగనే కింద కూలవడిపోతుంటా. నాకప్పుడు ఆరేడేండ్ల వయసుంటది గావొచ్చు! ఎప్పట్లెక్కనే బడికి వోతా ఉంటే ఓ రోజు కాళ్లు తట్టుకొని నడిరోడ్డు మీన్నే ముందటికి సర్సుకవడ్డ. దెబ్బకు ముక్కుదూలం అదిలి, ముక్కులకెళ్లి రక్తం కారింది. రోడ్డుపొంటి వొయ్యే ఓ ఎరుకున్న మనిషి ‘అయ్యో బిడ్డా, ఎంత పనాయె’నని లేవట్టి పక్కకు గూసోవెట్టిండు. కొద్దిసేపయినంక ఇన్ని నీళ్లు తాపిచ్చి ‘బడికొద్దు ఏమొద్దు, నిన్ను ఇంటికాడ దించిపోత పా’ అని నన్ను సైకిల్ మీద ఎక్కిచ్చుకొని ఇంటికి తోల్కవోయిండు.
ఆ పెద్ద మనిషి ‘ఈ పిలగాడు ఇట్ల కింద వడ్డడేందమ్మా’ అని అమ్మ సుకన్యనడిగితే ఆయనకు ఇట్లా చెప్పవట్టిందమ్మా.. “ఇద్దరు బిడ్డల కన్న ముందు ఈడే వుట్టిండు. తొల్సూరు కాన్పుల కొడుకు వుట్టిండనే సంతోషం మాకెన్నో రోజుల్లేదు. ‘సారూ.. రెండేండ్లయినా నా కొడుకు సక్కగా నడుస్తలేడని’ మేం డాక్టర్ దగ్గరికి వోతే ‘నీ కొడుకుకు కాళ్లు సక్కగ లెవ్వమ్మా, కొంచెం దేక్కుంట దేక్కుంట నడుస్తడ’ని జెప్పవట్టిండు డాక్టర్.” అమ్మ శోకాన్నిన్న ఆ పెద్దమనిషి ‘భగవంతా..’ అనుకుం టా బైటికి వోయిండు.
నన్ను కొన్నొద్దులు నాన్న మోహన్రావు బడికాడ దించొచ్చినా.. మెల్లమెల్లగా నేనొక్కన్నే బడికిపోవుడు అలవాటు జేస్కున్న. ఎన్నిరోజులని ఆయన మీన ఆధారపడుత? ఆయనకూ శేనుపని ఉంటది గదా? అమ్మకాడికొస్తే ఇద్దరాడివిల్లల్ని సదిరి, వాళ్లను బడికి దోలి నాన్నతోని సేనుకాడికి పోవాలె గదా? అందరి లెక్క నాక్కూడ కాళ్లు మంచిగుంటే ఐపోవు అని మస్తుసార్ల బాధవడ్డ. నా బాధిట్లా ఉంటే.. నా సోపతిగాళ్ల ఆపతి సోపతిగాళ్లది. నేను బడికి అచ్చిందిజూసి ‘అరేయ్ కుంటోడొస్తండు, కుంటోడస్తండు’ అని నన్ను ఏడ్పించేటోళ్లు. అయినా నేను వాళ్లను పట్టించుకోకవోయేటోన్ని. వీడెంతన్నా రేషానికొస్తలేడని కొన్నొద్దులకు వాళ్లే సక్కగైర్రు. తర్వాత అందరం గల్సి మంచిగ సద్వుకున్నం.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉప్పునుంతల మం డలంలోని పెద్దాపూర్ల మాకు మూడెకరాల భూమున్నది. దాన్ని సాగు జెయ్యడానికి నీళ్లు లేకుంటే… నాన్న మోహన్రావు మూడు బోర్లు గుద్దిపిచ్చిండు. ఎన్లగూడ సుక్క నీళ్లు వల్లే. ఓ రోజు.. అమ్మా-నాన్న, నేను, ఇద్దరు చెల్లెండ్లు అందరం గల్సి ఇంట్ల పడుకున్నం. ఓ అద్దుమనాత్రి ఈ అప్పులు ఎట్లా తీర్సుడా అని అమ్మా-నాన్న మస్తుబాధ వడ్డరు. ఆఖరికి ‘రేప్పొద్దున పోరగాండ్లను వట్టుకొని పట్నం బోదాం, ఆడ ఏదో ఒక పని దొర్కుతది’ అని నాన్నంటే అమ్మ సరే అన్నది.
2002ల మా మకాం పెద్దాపూర్ నుంచి కూకట్పల్లిలోని జగద్గిరిగుట్టకు మారింది. తెల్లారిలేస్తనే అమ్మా-నాన్నలు సద్దిబువ్వ వట్టుకొని అడ్డ కాడికి వోతుండె. నాన్న మేస్త్రీ పని, నాన్న చేతికిందికి అమ్మను గూడ తోల్కపోయేటోడు. నాదిగూడ అప్పుడే పదో తర్గతి అయిపోయింది. అమ్మానాన్నల ఆర్థిక పరిస్థితి జూసినంక నాకిగ సదువుకోబుద్ధి గాలె. అందుకే బంజేసిన. నేన్గూడ ఏదో పన్జేస్తే ఇంట్లకింత ఆసరైత గదా అని ఆలోచనజేసి నెలకు 1200 రూపాలకు పెట్రోల్ పంపుల పనికి కుదిరిన.
ఓ రోజు పొద్దున్నుంచి మిట్ట మజ్జాన్నం దాన్క ఎర్రటెండల పెట్రోల్ పోస్తా ఉన్న. ఇగ కాళ్లు నిలవల్లే. బండ్లె పెట్రోల్ పోస్తుండంగనే నిల్సున్నకాన్నే కూలవడ్డ. పెట్రోల్ గన్ కిందవడి పెట్రోల్ అంత కిందవడ్డది. ఇంకా నయ్యం మాకు భూమ్మీద నూకలు బాకీ ఉన్నయి గావొచ్చు. అందుకే ఆ రోజు అది అంటుకోలె. పుసుక్కున ఇంత నిప్పు రవ్వ ఆ పెట్రోల్ మీద వడ్తే మా గతేంది? అని ఆలోచించుకుంటె ఇప్పటికీ నిర్ద వట్టది. ఇగ మా సేటుకు ఎవ్వడెక్కిచ్చి చెప్పిండో ఏమో గని, నన్ను పెట్రోల్ పంపుల పీకిపారేసిర్రు. అప్పటిదాన్క జేబులిన్ని పైసల్ ఉండేటియి. నాటినుంచి కొత్తక్కరువైంది.
వికలాంగులంటెనే సమాజంల ఓ సిన్న సూపుంటది. అన్ల ప్యాదోడంటే ఇగ ఎట్లుంటదో తెల్వందేముంది? ఒక్క రూపాయి గూడ నమ్మేటోళ్లు గాదు? ఓ రోజు నా సోపతిగాన్ని ‘అరేయ్ ఓ మూడు వేల రూపాల అప్పియ్యిరా, మళ్లిస్తా’ అన్న. ‘నువ్వు మళ్లెట్లిస్తవురా, నా దగ్గర పైసల్లెవ్వు, మన్ను లెవ్వు నడువీడికెల్లి’ అని దూరం గొట్టిండు. ఇసొంటి అవమానాలు మస్తుగనే ఉన్నయి. ఇట్లా నేనొక్కన్నే గాదు, నా అసొంటి వికలాంగులు మస్తుమందే అవమానానికి గురైర్రు.
2014 జూన్ 2న తెలంగాణొచ్చింది. మా వికలాంగుల పరిస్థితి మారిపోయింది. వేముల భాస్కర్రావు అనే నా బ్యాంకు ఖాతాల మొదటిసారి 2,016 రూపాయలు వడ్డప్పుడు నా సంబురానికి పట్టపగ్గాల్లెవ్వు. అట్లా 2018 దాన్క నెలనెలా వడ్డయి. 2018 తర్వాత అవి 3,016 రూపాలైనయి. ఓసారి నన్నవమానించినోడే నా దగ్గరికొచ్చి ‘అరేయ్ భాస్కర్, ఓ వెయ్యి రూపాలు అప్పియ్యవారా? నేను మళ్లిస్తా’ అన్నడు. మారు మాట్లాడకుండా ఎంబడే వెయ్యి రూపాయలు గూగుల్ పేల కొట్టిన. నా సోపతిగాడు నా దగ్గరికొచ్చి అప్పుకింద పైసల్ అడిగినప్పడే నేను విజయం సాధించినట్టు లెక్క. నా విజయం ఎన్క ఎవరో గాదు, కేసీఆర్ సారున్నడు. ఆయనుంటెనే గదా? నా అసోంటోళ్లు రాష్ట్రంల 5 లక్షల 40 వేల మంది నెలనెలకు రూ.3,016 అందుకుంటున్నరు. ఇప్పుడు ఇంకో వెయ్యి పెంచిండు. మొత్తం నెలకు 4,016 రూపాలు అకౌంట్ల వడ్తయిగ. ఆసరా ఉంది, మాకెక్కడిదిగ ఆపతి?
-గడ్డం సతీష్
99590 59041