ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి పాలకులు తెలంగాణ రైతులను ఒక విధమైన ఆత్మన్యూనతా భావానికి గురిచేశారు- ఈ ప్రాంతం ఎత్తైన భూమి కాబట్టి, నదీ జలాలు ఉపయోగించలేమని. ఈ తప్పుడు నమ్మకంతో రైతులు కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. బోర్‌వెల్స్ వాడకం పెరిగినా, దానికి తగినట్టు భూగర్భ జలాలు పెరగకపోవడం, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు, కరువు, చీడపీడలు, అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ నిర్లక్ష్యం- అన్నీ కలిసి తరాల తరబడి వ్యవసాయం వదిలి వలసలు వెళ్లడం లేదా వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేయడం అనే దుస్థితికి దారితీసి తెలంగాణ ఒక కరువుపీడిత ప్రాంతంగా ఏర్పడటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు పాత్రను పోషించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాజెక్టులు మొదలయ్యాయి. కానీ, పాలకుల ఉదాసీనత వల్ల పూర్తికాలేక నిలిచిపోయాయి. అయితే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అసలైన మార్పు మొదలైంది. ఈ మార్పుకు ప్రతీకగా నిలిచింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. తొలిసారి గోదావరి నదీ జలాలు ఉత్తర తెలంగాణ పొలాల్లోకి, వాగులలోకి, చెరువులలోకి ఎత్తిపోతల ద్వారా చేరాయి. అందుకే కాళేశ్వరం కేవలం నీటిని తెచ్చిన పథకం కాదు. ఇది తెలంగాణలో వ్యవసాయానికి కొత్త ఆశలు, తెలంగాణ రైతులకు, యువతకు కొత్త అవకాశాలు తెచ్చిన యాత్ర. ఇది తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఒక మైలురాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంత వ్యవసాయాన్ని పునర్నిర్వచించింది. తద్వారా ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైన రాయలసీమ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి మొదలుపెట్టి పూర్తిచేసిన ఎత్తిపోతల పథకాలు రెండు. హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), గాలేరు-నగరి సుజల స్రవంతి. ఇవి రెండు కూడా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లే పోతిరెడ్డిపాడు ఆధారిత పథకాలు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వాలు మారినా, పార్టీల మధ్య అధికారం మారినా ఈ ప్రాజెక్టులు ఆగలేదు, ఆపబడలేదు.
గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు: ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన రెండు సుజల స్రవంతి పథకాల్లో ఇదొకటి. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు చాలా కీలకం. పోతిరెడ్డిపాడు వద్ద శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణా నది ‘మిగులు/ వరద’ జలాలను మళ్లించడానికి దీన్ని నిర్మించారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు సుమారు 334 కిలోమీటర్ల పొడవైన కాలువలను కలిగి ఉంది. విద్యుత్తు పంపులు సహా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను వాడుకొని అనేక ఎత్తయిన ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీటిని అందిస్తుంది. మొదటి దశలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అధిక సామర్థ్యం గల వర్టికల్ టర్బైన్ పంపుల సాయంతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నీళ్లను తెలుగుగంగ ప్రధాన కాలువ, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ వ్యవస్థలకు మళ్లిస్తారు. గండికోట రిజర్వాయర్ లిఫ్ట్ స్టేషన్ ఈ ప్రాజెక్టులో మొదటి లిఫ్ట్ పాయింట్. ఇది జీఎఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలోకి నీళ్లను ఎత్తిపోస్తుంది.
హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కాలేటివాగు లిఫ్ట్ పాయింట్ ద్వారా.. వెలిగల్లు రిజర్వాయర్‌తోపాటు పలు చెరువులకు నీళ్లు అందుతాయి. వెలిగల్లు రిజర్వాయర్ పంపింగ్ స్టేషన్, శ్రీబాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పలు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు. ఎస్ఆర్బీసీ లింక్‌లో గోరుకల్లు రిజర్వాయర్ లిఫ్ట్ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లాగా పని చేస్తుంది. మోటర్ల సాయంతో నీటిని ఎత్తిపోయడం ద్వారా అవుకు, ఇతర చెరువుల కింద వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు ఇది తోడ్పడుతుంది. తెలుగుగంగ లింక్‌లో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎస్ఆర్-1, ఎస్ఆర్-2, బ్రహ్మసాగర్ వంటి రిజర్వాయర్లకు నీటిని లిఫ్ట్ చేసే స్టేజింగ్ పాయింట్‌గా పనిచేస్తుంది. బ్రహ్మసాగర్‌కు ఎస్ఆర్-2 నుంచి నీళ్లు వస్తాయి. దీని కాలువ చివరి లిఫ్ట్ పాయింట్. కడప జిల్లాలో వ్యవసాయానికి ఇదే ప్రధాన సాగునీటి వనరు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి ‘మిగులు/ వరద’ జలాలను మళ్లించి రాయలసీమలోని కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగునీరు అందించడమే లక్ష్యంగా రూపొందించిన రెండవ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. సుమారుగా 565 కిలోమీటర్ల పొడవైన కాలువలు, 12 లిఫ్టులు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. 370 మీటర్ల ఎత్తున ఉన్న ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందిస్తుంది. 43 పంప్ హౌస్‌లు, 269 పంప్-మోటర్ యూనిట్ల సాయంతో ఈ సుజల స్రవంతి పథకం నడుస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఉన్న ముచ్చుమర్రి లిఫ్ట్ 12 పంపుల సాయంతో హెచ్ఎన్ఎస్ఎస్కు, 4 పంపుల ద్వారా కేసీ కెనాల్లోకి నీళ్లను ఎత్తిపోస్తుంది. జీడిపల్లి, మద్దికెర, అడవిపల్లి వంటి 8 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాదు, కొండప్రాంతాల గుండా 13.05 కిలోమీటర్ల పొడవైన 5 సొరంగాలూ ఉన్నాయి. మొదట దీన్ని 55 క్యూసెక్కుల నీళ్లను తరలించేందుకు గానూ రూపొందించారు. కానీ, ఇప్పుడు 109 క్యూసెక్కుల జలాలను తరలించడానికి వీలుగా 11 మీటర్ల నుంచి దాదాపు 20 మీటర్లకు కాలువను విస్తరిస్తున్నారు.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, సోషియాలజీ విభాగం,హైదరాబాద్ విశ్వవిద్యాలయం)
(తరువాయి రేపటి సంచికలో..)
-చంద్రి రాఘవరెడ్డి