‘కాళ్ళకును బంధాలు/ చేతులకరదండాలు మూతులకు చిక్కాలు/ మూల్గితే లాఠీలు రొమ్ములకు తూటాలు/ రోతలీ పాలన’లంటూ బానిస బతుకుల యథార్థ, వ్యథార్థ వాస్తవాలను తన కవితలో నిర్భయంగా చెప్పిన అభ్యుదయ కవి కాంచనపల్లి చిన వెంకట రామారావు నల్లగొండ జిల్లాకు పెద్ద దిక్కులాంటివారు. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన కాంచనపల్లి కవిగా కథా రచయితగా సుప్రసిద్ధులు. 1921 ఏప్రిల్ 21న సూర్యాపేటలోని రావిపాడు గ్రామంలో జన్మించిన కాంచనపల్లికి 1934 నుంచి సారస్వత పరిచయం ఏర్పడింది. స్వాతంత్య్ర పోరాటంలో అడుగడుగునా కలిగిన అనుభూతులకు శబ్దరూపం ఇచ్చి అక్షరత్వం కల్గించారు. ఫలితంగా ‘అరుణ రేఖలు’ అనే కావ్యం వెలువడింది. నిజాం నిరంకుశ అధికారంపై తిరుగుబాటుతో, సమాజంలోని అన్యాయాలపై ధిక్కారంతో ప్రజ్వలించి రౌద్రంగా, మహోద్రేకంగా అరుణ గీతాలను రాశారు. ఇందులోని ప్రతి పద్యం సూదిపోటులా గుండెలను సూటిగా తాకుతుంది. ఈ కావ్యం ద్వారా కాంచనపల్లి అభ్యుదయ కవులకు, ప్రజా కవులకు మార్గదర్శకులైనారు.
కాంచనపల్లి 1938-39లో నల్లగొండలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న రోజుల్లోనే సాహితీ మేఖల వ్యవస్థాపకులైన అంబటిపూడి వెంకటరత్నం రాఘవాచార్యులు అనే కవి అకాల మరణంపై రాసిన స్మృతిగీతాలు పులిజాల రంగారావు ఇంట్లో చదివినపుడు ఆ పద్యాలు కాంచనపల్లిని ఎంతో ప్రభావితుణ్ణి చేశాయి. అప్పటికే సురవరం ప్రతాపరెడ్డి వ్యావహారిక భాషావాద పక్షానికి వచ్చారు. యతిప్రాసలు లేకుండా పద్యాలెందుకు రాయకూడదు. కవిత్వగుణం, పదార్థం ఉం టే అవి రాణిస్తాయి కదా! యతిప్రాసలు కేవలం శబ్దాలంకారాలే కదా! అన్న వాదనలు ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో కాంచనపల్లి సాహసించి యతిప్రాసలు లేకుండా పద్యాలు రాసి ఎవరికీ చెప్పకుండా గోల్కొం డ పత్రికకు పంపిస్తే సురవరం ప్రచురించారు. కాంచనపల్లి దుందుడుకుతనానికి ఇదొక చక్కని నిదర్శనం.
పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటులో కాంచనపల్లి ప్రముఖ పాత్ర వహించారు. 1944-45వ సంవత్సరం అప్పటికే నిజాం వ్యతిరేక పోరాటాలు సాయుధ పోరాటాలుగా మారి నిజాం భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించడానికి సిద్ధమవుతున్న చరిత్రాత్మకమైన ఘట్టం. అలాంటి తరుణంలో కాంచనపల్లి ఆధ్వర్యంలో నల్లగొండలో ఆంధ్ర సారస్వత పరిషత్తు 3వ మహాసభలు జరిగాయి. ఈ సభలకు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, బిరుదు వేంకట శేషయ్య, ఓయూ మాజీ వైస్ ఛాన్స్లర్ రావాడ సత్యనారాయణ, ముణిమానిక్యం నరసింహారావు వంటి సుప్రసిద్ధులెందరో పాల్గొన్నారు. మూడురోజుల పాటు సాగిన ఈ సాహిత్య తిరునాళ్లలో ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంగీత ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
1946లో చండూరులో జరిగిన సాహితీ మేఖల దశమ వార్షికోత్సవాల సందర్భంలో కాంచనపల్లి ‘మన వూళ్ళో కూడానా’! అనే కథలు రాశారు. ఆనాడు ఈ కథలు ఎంతో ప్రసిద్ధమైనవి. వెట్టిచాకిరీ వివిధ రూపాల కేంద్రీకరణను ఇందులో చక్కగా చిత్రీకరించారు. తొమ్మిది కథలతో వెలువడిన ఈ కథా సంపుటి ఆనాటి దొరల దౌర్జన్యం, పేదల దుర్భరమైన బతుకును చూపించింది.
కాంచనపల్లి తన కవిత్వాన్ని ఉద్యమ నేపథ్యంలో ప్రజలకు ప్రాణవాయువుగా అందించారు. నిరంకుశాధికారులకు వ్యతిరేకంగా ప్రతిఘటనలను ప్రతిబింబిస్తూ పోరాట పాటలు రాశారు. ఇంకా వీరు జిల్లా సమగ్ర సమాచారాన్ని అజ్ఞాతంగా ఉన్న ఎందరో కవుల గురించి, మరుగునపడిన సాహిత్యసంస్థల వివరాలను సేకరించి అనేక వ్యాసాలు రాశారు. నల్లగొండ సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో వెలువడిన ‘దర్పణం’ సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగా ఉండి కావ్య సమీక్షలు చేశారు. నీలగిరి, గోల్కొం డ, అభ్యుదయ, తదితర పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. జిల్లాలోనే గాక, రాష్ట్ర ఉద్యమ సాహిత్యరంగాల్లోనూ కాంచనపల్లి ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘ ముఖ్యుల్లో ఒకరుగా ఉండి అభ్యుదయ భావాలను పెంపొందించుకున్నారు. నల్లగొండ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఉండి మూడు సార్లు మహాసభలను నిర్వహించారు. పలు పుస్తకావిష్కరణలను చేపట్టి, యువ కవులకు స్ఫూర్తిగా జిల్లాలో సాహిత్య చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి కాంచనపల్లి.
సాహిత్యరంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా కాంచనపల్లి గొప్ప అనుభవజ్ఞులు. 1952-57 మధ్య బూర్గుల రామకృష్ణారావు హయాంలో చినకొండూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పనిచేశారు. 1957 తర్వాత అనేక ప్రజా సంఘాలలో పనిచేశారు. నిరంకుశ నిజాం ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేయడానికి తెలంగాణలో సాగిన వీరోచిత పోరాటంలో కమ్యూనిస్టుగా పాల్గొని కడలూరు, రాయవెల్లూరు, వరంగల్లు, నిజామాబాద్ జైళ్లలో గడిపారు. కాంచనపల్లి నిరంతరం మార్క్సిస్టు గ్రంథాలను అధ్యయనం చేసి సమాజ పరిణామ గతిని గురించి స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సోవియట్‌ను దర్శించే సదవకాశం కలిగింది. అప్పుడు కాంచపల్లి తన అనుభవాలను, అనుభూతులను ‘మధుర స్మృతులు’ అనే పుస్తకంలో వివరించారు. రాష్ట్ర పౌరహక్కుల కమిటీ సభ్యులుగా పనిచేశారు. అనేక ఇతర సంస్థల్లోనూ పదవులను నిర్వహించారు. కవిగా, కథకుడిగా, ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా, ప్రముఖ న్యాయవాదిగా, అభ్యుదయవాదిగా పేరొందిన కాంచనపల్లి 1992 మార్చి 13న కన్నుమూశారు.
-పున్న అంజయ్య
93966 10639