మోదీ మాటల తూటాలపైనే గురి!
‘అక్రమ పాలకుల అంతానికి ఇది ఆరంభం! ఈ లక్ష్యంతోనే ముందుకు సాగాలి దేశ యువత! అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటమే ఏకైక పరిష్కార మార్గం! అణచివేతకు తలవంచడం ఈ నేలపై పుట్టిన వారి రక్తంలోనే లేదు! ఈ గొంతు గర్జిస్తూనే ఉంటుంది! ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది! ఢిల్లీ పాలకులను గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగదు గాక ఆగదు’. 2014కు ముందు..గత పాలకులకు వ్యతిరేకంగా, భావోద్వేగాలతో యువతను కదం తొక్కించిన నరేంద్ర మోదీ ప్రసంగాల్లో కొన్ని వాక్యాలివి!’
మోదీ ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలను ప్రతిఘటిస్తూ..నాటి ఆయన సూచనలను తు.చ తప్పక పాటిస్తున్నది ‘సీజేపీ’! అంటే..ఆ పేరిట ఐక్యమైన భారత యువత! నాడు స్వాతంత్య్రం కోసం ఉద్యమించినట్టే..నేడు ప్రజాస్వామ్యం కోసం సమైక్యంగా ఉద్యమించింది దేశ యువత! శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారి అణచివేతకు మోదీ, అమిత్ షా చేపట్టిన అప్రజాస్వామిక చర్యలు..నాడు స్వాతంత్య్ర ఉద్యమకారులపై క్రూర అణచివేతకు పూనుకున్న బ్రిటిష్ పాలకులను గుర్తుచేస్తున్నాయి! పరీక్ష పేపర్ల లీకేజీకి కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరినట్టే..13 కోట్ల మంది ఓటర్లను తొలగించిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను కోరుతూ శాంతియుత నిరసనకు దిగింది యువత!-‘ఓటర్ల లిస్టు నుంచి ఒక ఓటరు పేరు తొలగించడమంటే ఒక వ్యక్తి దేహం నుంచి అతని ఆత్మను తొలగించడమే!-నోటీసు ఇవ్వకుండా బతికున్న ఓటరును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమే’నని ఉద్ఘాటించారు జస్టిస్ ఉజ్జల్ భుయాన్.
నోటీసులు ఇవ్వకపోవడమే కాకుండా, సహ ఈసీలు సుఖ్బీర్ సింగ్, వివేక్ జోషిల అభ్యంతరాలను కూడా లెక్కచేయక, చట్టబద్ధంగా మార్చవలసిన ‘ఫారమ్ 6-7-8’లను ఏకపక్షంగా మార్చి, 14 శాతం ఓటర్లను తొలగించడం జ్ఞానేశ్ అతి పెద్ద అప్రజాస్వామిక చర్య! ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రితికా చోప్రా ఏడాదిపాటు పరిశోధించి-‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ద్వారా జ్ఞానేశ్ గుట్టును రట్టు చేయడంతో దేశం ఉలిక్కిపడింది! ఈ కుట్ర గురించి ప్రతిపక్షాలు, సీజేపీ సంధిస్తున్న ఏ ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేక, మౌనం వహించడం ద్వారా జ్ఞానేశ్ తప్పులను అంగీకరించకనే అంగీకరించినట్లయ్యింది మోదీ సర్కార్.
అసలీ తప్పుల్ని జ్ఞానేశ్ చేత చేయించింది మోదీ, అమిత్ షాలేనని సీజేపీ సహా బీజేపేయేతర పార్టీలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి! ఐనా సరే సదరు ఆరోపణలు అవాస్తవాలను సహేతుకంగా నిరూపించి, ప్రజాస్వామ్యం బతికే ఉన్నదని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించాల్సిన మోదీ ప్రభుత్వం-తమను నిలదీసిన ప్రత్యర్థులను కేసులతో, తమ గుట్టును రట్టు చేస్తున్న జర్నలిస్ట్‌లను చిత్రహింసలతో, శాంతియుత నిరసనకారులను పోలీసులతోనే కాకుండా ప్రైవేట్ గూండాలతో చితగ్గొట్టిస్తూ..అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు.
కార్పొరేట్ల కోసం పరిశ్రమిస్తున్న తమ పార్టీ, ప్రజాభిమానంతో గద్దెనెక్కడం అసాధ్యమన్న వాస్తవం మోదీ, అమిత్ షాకు తెలుసు! అందుకే రాజ్యాధికారం కోసం పలు మాయోపాయాలను రూపొందించుకున్నది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని అదృశ్యం చేసే అతి పెద్ద కుట్ర ఏమంటే? తమ ఈసీ జ్ఞానేశ్ ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను కోట్లలో తొలగించడం-తమ ఈవీఎంల రిగ్గింగ్‌కు తోడ్పడేలా లక్షలాది దొంగఓట్లను చేర్పించడం ద్వారా ఎట్టిపరిస్థితుల్లోనూ, ఎప్పటికీ బీజేపీనే గద్దెనెక్కించే దిశగా ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశారు మోదీ, అమిత్ షా!ఈ ప్రమాదం నుంచి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కదనరంగంలో దూకింది సీజేపీ! నాడు మన్మోహన్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా యువతను కదం తొక్కించిన నాటి మోదీ మాటల తూటాలనే నేడు ప్రభుత్వానికి గురిపెట్టింది సీజేపీ! వీరోచిత సీజేపీ వెంటే బీజేపీయేతర పార్టీలన్నీ కదం తొక్కుతున్నాయ్! విజయీభవ సీజీపే! అభీష్ట సిద్ధిరస్తు సీజేపీ!
పాతూరి వేంకటేశ్వరరావు
9849081889
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

